నీతికి నీళ్లు | Sakshi
Sakshi News home page

నీతికి నీళ్లు

Published Thu, Nov 13 2014 1:59 AM

నీతికి నీళ్లు - Sakshi

అటకెక్కిన ‘పారదర్శక పాలన’

ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై భూ అవినీతి ఆరోపణలు
ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొటున్న డీకేశీ, మహదేవ ప్రసాద్, ఖమరుల్ ఇస్లాం
తాజాగా ఆ జాబితాలో చేరిన దినేష్ గుండూరావు

 
పారదర్శక పాలన అందిస్తాం .. క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే మంత్రి వర్గంలో చోటిస్తాం... అని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆ వాగ్దానాలను  పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా మంత్రులు కూడా భూముల డీనోటిఫికేషన్, భూముల కబ్జా, ఇసుక అక్రమ రవాణా.. ఇలా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు కూడా ఆ జాబితాలో చేరారు.
 
బెంగళూరు :  కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సారధిగా ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఆర్కావతి లే అవుట్‌లోని బీడీఏ స్థలాల డీనోటిఫికేషన్‌కు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో భూ అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని బెన్నిగానహళ్లిలో నాలుగు ఎకరాల భూముల డీనోటిఫికేషన్ పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటికే లోకాయుక్త విచారణ కొనసాగుతోంది. అంతేకాక బెంగళూరు-మైసూరు ఇన్‌ఫ్రాస్టక్చర్ కారిడార్‌లో అక్రమాలు, అక్రమ మైనింగ్ వంటి అనేక ఆరోపణలు డీకే శివకుమార్ ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ తనకు సొంత భూములు లేవని  కర్ణాటక హౌసింగ్ బోర్డ్‌కు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను అందజేసి చామరాజనగరలో భూములను సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై లోకాయుక్త పోలీసులు విచారణ చేపట్టారు. మహదేవ ప్రసాద్‌కు మైసూరులో సొంత భూములున్నాయని లోకాయుక్త పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 30న మైసూరు జిల్లా కోర్టుకు నివేదికను అందజేశారు. ఇక రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం సైతం వక్ఫ్ బోర్డ్ ఆస్తుల ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తాజాగా గుండూరావు

భూ అవినీతికి పాల్పడిన మంత్రుల జాబితాలో తాజాగా రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు సైతం చేశారు. యలహంక ప్రాంతంలోని నవరత్న అగ్రహార వద్ద 10.9 ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి దినేష్ గుండూరావు ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించుకున్నారని యలహంక తహసీల్దార్ బాళప్ప లోకాయుక్తకు నివేదిక అందజేసిన విషయం తెలిసిందే.

దీంతో పారదర్శక పాలన నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూ బకాసురులు, అవినీతి పరులతోనే మంత్రి వర్గాన్ని నింపుకుందని ప్రతిపక్ష బీజేపీ విమర్శిస్తోంది. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థతపై పోరాటానికి సన్నద్ధమవుతున్నట్లు హెచ్చరికలు సైతం జారీచేసింది.  కాగా త్వరలో జరగనున్న మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భూ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉద్వాసన పలకుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement