జలక్షామం | Sakshi
Sakshi News home page

జలక్షామం

Published Mon, Feb 22 2016 2:16 AM

Risks from water shortages

అడుగంటిన జలాశయాలు
పొంచి ఉన్న నీటి ఎద్దడి

 
బెంగళూరు:   రాష్ట్రంలో జలక్షామ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు అడుగంటాయి. డెడ్ స్టోరీజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. దీంతో ఈ వేసవిలో బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా పదమూడు నదీజలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారానే రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలకు తాగు, సాగునీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది రాష్ట్రంలో  ఖరీఫ్, రబీ సీజన్లలో తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఖరీఫ్ సీజన్‌లో 32 శాతం తక్కువ వర్షపాతం కురవగా, రబీలో 55 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో మొత్తం 17 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. అంతేకాకుండా రాష్ట్రంలో అంతకు ముందు  రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహనం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. ఈ విషయంలో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ భాగాలకు సాగునీటిని అందించే తుంగభద్ర డ్యాం మరీ ఘోరం. ఈ డ్యాం పూర్తిస్థాయి స్టోరేజ్ కెపాసిటీ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం (ఫిబ్రవరి-21 నాటికి) ఇక్కడ కేవలం 8.884 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి తుంగభద్ర డ్యాంలో  దాదాపు 31 టీఎంసీల నీరు ఉండటం గమనార్హం. ఇక కృష్ణా నదీపరివాహక జలాశయాలైన భద్ర, ఘటప్రభ, మలప్రభ, అల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి.

ఈ విషయమై కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ (కేఎస్‌ఎన్‌డీఎంసీ) డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కావేరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కేఆర్‌ఎస్ వంటి జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే తక్కువకు నీటి మట్టం పడిపోవడం గమనించాం. అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఈ ఏడాది మాత్రం కావేరితో పాటు కృష్ణా నదీపరివాహక ప్రాంతంలోని జలాశయాలు కూడా డెడ్‌స్టోరేజీ కంటే దిగువన నీటి మట్టాన్ని కలిగి ఉన్నాయి. అందువల్లే కావేరితో పాటు కృష్ణా నదీపరివాహక ప్రాంతంలో ఈ వేసవిలో పంటకు అవసరమైన నీటిని విడుదల చేసేది లేదని ప్రకటించాం.’ అని పేర్కొన్నారు. ఇక బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చే కే.ఆర్.ఎస్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 49.45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.69 టీఎంసీలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి (ఫిబ్రవరి-16) కేఆర్‌ఎస్‌లో 32.84 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీంతో రానున్న వేసవిలో తాగు నీటి కోసం ఇప్పటి నుంచే ఆంక్షలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా వర్షాభావ పరిస్థితుల్లో కర్ణాటకలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా తాగు, సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురయ్యిదని కేఎస్‌ఎన్‌డీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement