16వేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు

26 Jun, 2014 01:46 IST|Sakshi
 • మంత్రి కిమ్మనె రత్నాకర్  
 •  త్వరలో పీయూ పుస్తకాలు
 • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వచ్చే అక్టోబరు లోగా 16,200 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను నియమించనున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. శాసన సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు ఈ. తుకారాం ప్రశ్నకు బదులిస్తూ ఖాళీలున్న పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులను నియమించనున్నట్లు వెల్లడించారు.

  ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 28 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.  12 వేల మంది ఉపాధ్యాయులను నియమించడానికి ఆర్థిక శాఖ అనుమతి లభించిందన్నారు. మరో ఐదు వేల మందిని నియమించుకోవడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని చెప్పారు. ఇప్పటికే టీచర్ల అర్హతా పరీక్ష (టెట్)ను నిర్వహించినట్లు గుర్తు చేశారు.
   
  వారంలోగా పీయూ పుస్తకాలు
   
  రాష్ట్రంలో పీయూ విద్యార్థులకు వారంలోగా అన్ని పుస్తకాలను సమకూర్చతామని మంత్రి తెలిపారు. సభ్యుడు మొహియుద్దీన్ బాబా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇప్పటికే 60 శాతం పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మిగిలిన పుస్తకాలను కూడా త్వరితంగా ముద్రించి అందజేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
   
  రమేశ్ కుమార్ ఆగ్రహం
   
  ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి, సొంత పార్టీ సభ్యుని ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన రమేశ్ కుమార్ పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి, ఆఖరికి మూడు, నాలుగు కోట్లు విదిలిస్తారని దెప్పి పొడిచారు. దీనికీ చాలా మంది అధికారుల అనుమతి అవసరమని అన్నారు.

  పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు ప్రతి నియోజక వర్గానికి రూ.40 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై రమేశ్ కుమార్ మండిపడుతూ, శాసన సభ్యులకేమైనా కానుకలిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ప్రాథమిక సదుపాయాలు లేక అనేక పాఠశాలలు మూతపడే స్థాయికి చేరుకున్నాయని ఆయన విమర్శించారు.
   

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా