పెన్‌ డ్రైవ్‌లో రహస్యమా? | Sakshi
Sakshi News home page

మరింత దూకుడు

Published Mon, Nov 20 2017 6:52 AM

Sasikala family blames Jayalalitha for their 'suffering' - Sakshi

ఆదాయ పన్ను శాఖ మరింతగా దూకుడు పెంచనుంది.  చిన్నమ్మ కుటుంబీకులకు చెందిన 85 బ్యాంకుల్లోని 240 లాకర్ల తాళాల్ని  తెరిచేందుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, పోయెస్‌ గార్డెన్‌ వేద నిలయంలోని అమ్మ గదిలో సోదాలకు ప్రత్యేక బృందం సిద్ధం అవుతోంది. మరికొన్ని చోట్ల దాడులు లక్ష్యంగా మరికొన్ని బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి. అలాగే,  పరప్పన అగ్రహార చెరలోని ఆ ఇద్దర్నీ విచారించేందుకు అనుమతి కోరుతూ బెంగళూరు కోర్టును ఆశ్రయించేందుకు తగ్గ చర్యల్లో మరో బృందం నిగమ్నమైనట్టు సమాచారం.

సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ అండ్‌ ఫ్యామిలీని గురిపెట్టి సాగిన ఐటీ సోదాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రస్తుతం విచారణ వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమ్మ జయలలిత సహాయకుడు పూంగుండ్రన్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో తనిఖీలు సాగాయని సమాచారం. అక్కడ అన్ని గదుల్లో తనిఖీలు సాగినా, అమ్మ జయలలిత గది దగ్గరకు మాత్రం వెళ్ల లేదు. ఆ ఇంటి నుంచి కంప్యూటర్, పెన్‌ డ్రైవర్‌తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అందులో లభించిన సమాచారం, ఐదారు రోజుల పాటు సాగిన సోదాల్లో దొరికిన ఆధారాల మేరకు ఇక, చిన్నమ్మ శశికళతో పాటు పరప్పన అగ్రహార చెరలో ఉన్న ఇళవరసిని కూడా విచారణ వలయంలోకి తెచ్చేందుకు కసరత్తులు
సాగుతున్నాయి.

మనో వేదనలో చిన్నమ్మ
పరప్పనఅగ్రహార చెరలో ఉన్న శశికళ, ఇళవరసిలను విచారించడం లక్ష్యంగా ప్రత్యేక బృందం ఒకటి రెండు రోజుల్లో బెంగళూరుకు పయనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి.  బెంగళూరు కోర్టును ఆశ్రయించి అనుమతుల్ని కోరబోతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడకు చిన్నమ్మను గానీ, ఇళవరసిని గానీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని, అంతా బెంగళూరు జైలు వేదిగానే విచారణలు సాగుతాయని ఓ అధికారి పేర్కొన్నారు.  ఇక, ఈ విచారణ గురించి  పరప్పన అగ్రహార చెర అధికారి రమేష్‌ కుమార్‌ను ఓ మీడియా కదిలించగా, ఆ ఇద్దర్ని విచారించేందుకు తగ్గ సమాచారం తమకు ఇంతవరకు రాలేదన్నారు. కోర్టు అనుమతితో వస్తే అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఇదివరకు కోర్టు అనుమతితో ఇక్కడ  విచారణలో సాగాయని గుర్తుచేశారు. కాగా, ఇప్పటికే ఐటీ దాడులు, భర్త నటరాజన్‌కు జైలు శిక్ష, ప్రస్తుతం తమ వద్ద విచారణకు రంగం సిద్ధం అవుతుండడంతో చిన్నమ్మకు కంటి మీద కనుకు కరువైనట్టు సమాచారం.

బ్యాంకు లాకర్లపై గురి
ఐటీ సోదాల్లో లభించిన సమాచారాల మేరకు చిన్నమ్మ అండ్‌ ఫ్యామిలీకి ప్రైవేటు, సహకార పరిధిలోని 85 బ్యాంకుల్లో ప్రత్యేకంగా 240 లాకర్లు ఉన్నట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. ఆ లాకర్లను తెరిచేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. ఆయా బ్యాంకులకు ఇప్పటికే తనిఖీలకు సంబంధించి లేఖలు వెళ్లినట్టు, ఒకటి రెండు రోజుల్లో లాకర్లలో ఉన్న మరింత అక్రమార్జన గుట్టును బయటపెట్టడంతో పాటు, మరికొన్ని  ఐటీ సోదాలకు అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, అమ్మ జయలలిత గది తాళం తెరవడం ఖాయం అని చెబుతున్నారు.

మిడాస్‌ మద్యం బంద్‌
శశికళ కుటుంబానికి చెందిన మిడాస్‌ స్పిరిట్, లిక్కర్స్‌ ద్వారా అనేక మద్యం బ్రాండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కాంచీపురం జిల్లా పడప్పై సమీపంలోని వేల ఎకరాల విస్తీరణంలో ఉన్న పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే బ్రాండ్లన్నీ టాస్మాక్‌ మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక్కడి బ్రాండ్లకే ఇదివరకు ప్రాధాన్యత ఉండేది. అయితే, ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో మిడాస్‌ మద్యం కొనుగోలును టాస్మాక్‌ వర్గాలు నిలుపుదల చేశాయి. ఐటీ దాడులు, విచారణల నేపథ్యంలో  ఎక్కడ తమ మీద ఐటీ కన్ను పడుతుందో అనే బెంగో లేదా, మరేదేని కారణాలో ఏమోగానీ మిడాస్‌ బ్రాండ్ల కొనుగోలును నిలుపుదల చేస్తూ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పెన్‌ డ్రైవ్‌లో రహస్యమా?
దినకరన్‌ ఆదివారం తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ, అబ్బో పెన్‌డ్రైవ్‌లో రహస్యాలు ఉన్నాయా..? అని వ్యంగ్యాస్త్రం సంధించారు. పెన్‌ డ్రైవ్‌ అంటే అందులో వ్యక్తిగత విషయాలు ఉండవచ్చు, రహస్యాలూ ఉండ వచ్చని వ్యాఖ్యానించారు. అంత మాత్రాన అభూత కల్పనలతో వ్యాఖ్యలు చేయ వద్దు అని సూచించారు. శశికళ భద్రతకు అమ్మ చర్యలు తీసుకోలేదని దివాకరన్‌ వ్యాఖ్యానించడంలో తప్పు లేదని పేర్కొన్నారు. జయలలిత కష్ట సుఖాల్లో శశికళ పాలు పంచుకున్నారని, అమ్మ ఇప్పుడు లేని దృష్ట్యా, చిన్నమ్మకు ఎదురు అవుతున్న కష్టాల్ని చూసి, ఆమె సోదరు దివాకరన్‌ అలా చెప్పి ఉంటారని, దీనిన భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

సింహం లేదు కాబట్టే ..
ఐటీ సోదాల గురించి పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..  సింహం జీవించి ఉన్నప్పుడు గుంట నక్కలు గుహలోకి చొరబడ్డాయని, ఆ నక్కల పుణ్యమా ఇప్పుడు గుహలో సోదాలు తప్పలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయం కోటిన్నర మందితో కూడిన అన్నాడీఎంకే కేడర్‌కు ఆలయం అని, ఆ గుంట నక్కల రూపంలో ఇప్పుడు ఆలయానికి సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదని వ్యాఖ్యానించారు. సింహం గుహలో ఉండి ఉంటే, దర్జాగా చొరబడి తనిఖీలు చేసి ఉంటారా..? అని ఐటీ వర్గాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటనలో పేర్కొంటూ, జయలలిత ఏదో అవినీతికి దూరం అన్నట్టుగా అనేక మంది వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. అవినీతిలో జయలలిత మహారాణి అయితే, శశికళ యువ రాణి అని ఎద్దేవా చేశారు.

కాగా, కేంద్ర సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఐటీ దాడుల గురించి తూత్తుకుడిలో  పేర్కొంటూ, ఇక్కడ వ్యక్తిగత దాడులు జరగలేదని, ఐటీ వర్గాలు సేకరించిన సమగ్ర సమాచారం మేరకు సోదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం పళని స్వామి మరో మారు మీడియా ముందు స్పందిస్తూ పోయెస్‌ గార్డెన్‌లో సోదాలు తీవ్ర మనోవేదనకు గురి చేసినట్టు వ్యాఖ్యలు గుప్పించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ స్పందిస్తూ, ఐటీ దాడులు చిన్నమ్మ కుటుంబానికే పరిమితం చేయకుండా, అన్నాడీఎంకే వర్గాలందర్నీ గురి పెట్టాలని, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మాజీలు, అందర్నీ వలయంలోకి తీసుకొస్తే బండారాలన్నీ బయటకు వచ్చి తీరుతాయని వ్యాఖ్యానించారు.

వీడియోను అమ్మే చిత్రీకరించమన్నారు
ఆసుపత్రిలో అందుతున్న వైద్య చికిత్సల గురించి అమ్మ జయలలిత వీడియో చిత్రీకరించమన్నట్టు శశికళ సోదరుడు దివాకరన్‌ వ్యాఖ్యానించారు. ఓ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అమ్మకు అందుతున్న వైద్యంలో అనుమానాలు అంటూ, డీఎంకే ఆరోపణలు గుప్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో అమ్మ జయలలిత వైద్య చికిత్సల గురించి వీడియో చిత్రీకరణ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.తనకు ఏదేని జరిగిన పక్షంలో, మరేదేని జరగవచ్చు అని, ద్రోహులు మన వద్దే ఉన్నట్టు శశికళ వద్ద అమ్మే స్వయంగా వ్యాఖ్యానించినట్టు వివరించారు. అయితే, శశికళకు భద్రతగా ప్రత్యేక  వలయం ఏర్పాటు చేయక పోవడం ప్రశ్నార్థకం అని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి జయకుమార్‌ లాంటి వాళ్లు తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, వ్యక్తిగత పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.  ఐటీ దాడులు ఎక్కడైనా జరగనీయండి, జరగవచ్చు అని వ్యాఖ్యానిస్తూ, పోయెస్‌ గార్డెన్‌లో జరగడం మనో వేదనకు గురిచేసిందన్నారు.  పోయెస్‌ గార్డెన్‌లో పెన్‌ డ్రైవ్, కంప్యూటర్లు సీజ్‌ చేసినట్టుగా తనకు తెలియదన్నారు. అయితే, విచారణ అన్నది వచ్చాక, ఆ వలయంలోకి అందరూ తప్పకుండా వచ్చి తీరుతారని, ఇది జరుగుతుందని ముగించారు.

Advertisement
Advertisement