చిన్నమ్మే అమ్మ | Sakshi
Sakshi News home page

చిన్నమ్మే అమ్మ

Published Mon, Feb 6 2017 1:35 AM

Sasikala to be next Tamil Nadu chief minister, Panneerselvam resigns

► 9న ముఖ్యమంత్రిగా శశికళ  ప్రమాణ స్వీకారం
►  అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు
►  అమ్మ భక్తులపై వేటు


రెండు దశాబ్దాలుగా చిన్నమ్మగా పిలిపించుకున్న శశికళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 9వ తేదీన బాధ్యతలు చేపట్టడం ద్వారా అమ్మగా మారిపోనున్నారు. జయలలిత మరణించిన తరుణంలో ఆ స్థానంలో కూర్చొనడం ద్వారా ఇక చిన్నమ్మను కాదు అమ్మ ... అని చెప్పకనే చెబుతున్నారు. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా, మూడవ మహిళా ముఖ్యమంత్రిగా రాజకీయచరిత్ర పుటల్లో నిలవబోతున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్  హయాంలో పార్టీలో నంబర్‌ 2గా వెలుగొందిన జయలలిత ఆయన మరణం తరువాత నంబర్‌ ఒన్ గా ఎదిగారు. పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా విజయపథంలో పయనించారు. అయితే జయ తన హయాంలో ఎవ్వరినీ నంబర్‌ 2గా పరిగణించలేదు. పార్టీ, ప్రభుత్వ విషయాల్లో అన్నీతానై వ్యవహరించిన జయలలిత తన నెచ్చెలి శశికళకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులు, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినపుడు మంత్రి పదవుల పందేరం శశికళ సలహాలు తీసుకున్నట్లు చెబుతారు. పార్టీ, ప్రభుత్వాల్లో శశికళకు జయలలిత అధికారికంగా ఏమాత్రం ప్రాధాన్యతనివ్వకున్నా నేతలు కూడా శశికళకు అనుగుణంగా నడవడం అలవాటు చేసుకున్నారు.

జయ వద్ద శశికళ ఎంత చెబితే అంత అని పోయెస్‌గార్డెన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అన్నాడీఎంకేలో అనధికార నంబర్‌టూగా ఎదిగారు. జయ మరణం తరువాత ఈ అనధికార నంబర్‌టూనే శశికళకు కలిసొచ్చే అంశంగా మారింది. జయలలిత వద్ద మోకరిల్లే పార్టీ శ్రేణులంతా శశికళకు పాదాభివందనం చేయడం ప్రారంభించారు. గత నెలాఖరులో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఈ నెలారంభంలో శాసనసభా పక్ష నేతగా శశికళను అందలం ఎక్కించారు. ఇటీవలి వరకు జయలలితే పార్టీకి దైవం అని కీర్తించిన వారంతా నేడు శశికళను అదే స్థాయిలో పొగుడుతున్నారు. జయకు దీటుగా పార్టీని, ప్రభుత్వాని నడిపించే సత్తా శశికళకు మాత్రమే ఉందని చెబుతున్నారు.

జయ అనుచరులకు చెక్‌ : ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలోనూ జయలలిత అంటే అలవిమాలిన భక్తిని చాటేవారికి శశికళ చెక్‌పెట్టడం చర్చ నీయాంశమైంది. ప్రభుత్వ గౌరవసలహాదారు షీలాబాలకృష్ణన్ తో ప్రారంభమై, ముఖ్యమంత్రి కార్యదర్శులు వెంకట్రామన్, రామలింగంలను బాధ్యతలను తప్పించడం వంటి సంఘటనలు ఇప్పటికే చోటుచేసుకున్నాయి. తరువాత దశగా జయకు ఎంతో ప్రీతిపాత్రుడైన పన్నీర్‌సెల్వం సీఎం పదవికే శశికళ ఉద్వాసన పలికారు.

ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భారీస్థాయిలో మంత్రి వర్గంలో మార్పులు జరగడం, జయలలిత అనుచరులపె వేటు ఖాయమని అంటున్నారు. తాను సీఎం అయ్యేందుకు సహకరించిన వారిని అందలం ఎక్కించి మిన్నకుండిపోయిన మంత్రులను ఇంటిబాట పట్టించడమే శశికళ తరువాత వ్యూహంగా చెప్పుకుంటున్నారు. అలాగే సచివాలయం, పోలీస్‌శాఖలోని సీనియర్‌ అధికారులకు సైతం స్థానభ్రంశం తప్పదని తెలుస్తోంది.

Advertisement
Advertisement