కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

Published Fri, May 15 2015 12:54 AM

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ - Sakshi

 మీడియాకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించిన సుప్రీం
 తదుపరి ఉత్తర్వు జారీచేసే వరకు ముందుకెళ్లద్దని ఆదేశం
 జులై 8న తదుపరి విచారణ
 దీనిపై ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్ సర్కార్‌కు ఆదేశం
 కేజ్రీవాల్ రెండు నాల్కల ధోరణిని కోర్టుకు తెలిపిన అమిత్ సిబల్

 
 సాక్షి, న్యూఢిల్లీ: మీడియాను హద్దుల్లో పెట్టడానికి కేజ్రీవాల్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వు అమలుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీసే వార్తలు ప్రచురించే, ప్రసారం చేసే మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేజ్రీవాల్ సర్కారు ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ప్రఫుల్ల సి. సంపత్‌లతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేయాలని ఆదేశిస్తూ తాము తదుపరి ఉత్తర్వు ఇచ్చేవరకు మే6న ఢిల్లీ సర్కారు జారీ చేసిన సర్క్యులర్‌పై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది.
 
  జులై 8న కేసుపై తదుపరి విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇన్ఫర్మేషన్ డెరైక్టరేట్ ఇలాంటి సర్క్యులర్‌ను ఎందుకు జారీ చేసిందో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరు వారాల్లో అంటే జులై 8 లోగా తెలపాలని ధర్మాసనం కేజ్రీవాల్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పరువు నష్టం దావాల విషయంలో కే జ్రీవాల్ అనుసరిస్తోన్న రెండు నాల్కల ధోరణిని సీనియర్ న్యాయవాది అమిత్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో సుప్రీం కోర్టు ఈ స్టే జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి  కపిల్ సిబల్ కుమారుడైన అమిత్ సిబల్  కేజ్రీవాల్ తదితరులపై గతంలో పటియాలా కోర్టులో  క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఈ దావా చట్టబద్ధతను సవాలుచేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పరువు నష్టం దావా విచారణపై సుప్రీం స్టే విధించింది.
 
 అమిత్ సిబల్ గురువారం ఈ స్టేను ఎత్తివేయాలని కోరుతూ.. కేజ్రీవాల్ సర్కారు మీడియాకు పగ్గాలు వేయడానికి జారీ చేసిన సర్క్యులర్‌ను సుప్రీంకోరు ్ట దృష్టికి తె చ్చారు. కేజ్రీవాల్ ఓ పక్క పరువునష్టం దావా చట్టబద్ధతను సవాలుచేస్తూ, మరో పక్క మీడియాపై పరువు నష్టం దావా వేయాలని ఆదేశిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పరువునష్టం దావాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసి, మీడియాపై పరువునష్టం దావాకు ఉత్తర్వు జారీ చేయడం సబబు కాదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ అమలుపై స్టే విధించింది.
 
 ప్రభుత్వానిది అప్రజాస్వామిక ఉత్తర్వు: కాంగ్రెస్, బీజేపీ
 పత్రికలలో ప్రచురితమైన లేదా టీవీ చానెళ్లలో ప్రసారమైన వార్త ఏదైనా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారికి ఎవరికైనా అనిపిస్తే ఆ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని కేజ్రీవాల్ సర్కారు ఉత్తర్వులో పేర్కొంది.ప్రాసిక్యూషన్ డెరైక్టర్, ప్రభుత్వ న్యాయశాఖ అనుమతి లభించిన తరువాత ప్రభుత్వం పరువునష్టం కూడా దాఖలు చేయవచ్చని సర్క్యులర్ తెలిపింది. మీడియాకు పగ్గాలు వేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశంపై అనేక విమర్శలు వెలువడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ దీనిని నిరంకుశ, అప్రజాస్వామిక ఉత్తర్వుగా అభివర్ణించాయి.
 
  ఈ ఆదేశం అమలుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించడం పట్ల డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాను పూర్తిగా ఉపయోగించుకున్నారని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని అప్పుడు వాదించి ఇప్పుడు దానిని అడ్డుకోడానికి ప్రయత్నించారని మాకెన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉత్తర్వు అమలుపై స్టే విధించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మీడియా ఆప్ గుట్టు బయటపెడుతుందని కేజ్రీవాల్ భయపడుతున్నారని, నైతికత గురించి మాట్లాడే ఆయన తన పార్టీలోని అవినీతిపరులైన నేతలపై చర్యలు చేపట్టడం లేదని ఉపాధ్యాయ ఆరోపించారు.
 
 కేజ్రీవాల్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారు
 ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తల్ని ప్రసారం చేసే మీడియా సంస్థలపై పరువు నష్టం కేసు వేస్తామంటూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని బహిషృత ఆప్‌నేత ప్రశాంత్ భూషణ్ స్వాగతించారు. కేజ్రీవాల్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. కేజ్రీవాల్ ఒకవైపు తను ఎదుర్కొంటున్న పరువు నష్టం కేసు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ..మరోవైపు అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై ప్రభుత్వ ఖర్చులతో పరువు నష్టం కేసు వేస్తామని ఉత్తర్వులు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు గుర్తించిందన్నారు.
 - బహిష్కృత ఆప్ నేత ప్రశాంత్ భూషణ్
 

Advertisement
Advertisement