కరూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

కరూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, May 14 2017 2:28 AM

కరూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

♦  కారును ఢీకొన్న ఇసుక లారీ
♦  చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం
♦  నలుగురికి తీవ్ర గాయాలు


వాళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వారు. ఆధ్యాత్మిక చింతనతో రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ఆలయాలు చుట్టి ఆనందపరవశులయ్యారు. ఆ తీపి గురుతులను నెమరు వేసుకుంటూ ఇంటిముఖం పట్టారు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం. విధి ఆడిన వింత నాటకంలో ఏడుగురు బలైపోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన శనివారం కరూర్‌ జిల్లాలో కన్నీళ్లు తెప్పించింది. బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

సేలం : తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో శనివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, మహిళ సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేరళ రాష్ట్రం కాసర్‌కోడు జిల్లా మందైకాప్పు ప్రాంతానికి చెందిన రోహిత్‌ మంజర(22), జరాల్డ్‌ మంజర(35), క్షత్రియన్‌ (30), ఆల్విన్‌ (40),

విహారం.. విషాదం
రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6), జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్‌ కారులో వేలాంకన్ని పర్యాటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి అదేకారులో తిరుగుపయనమయ్యారు. కారును రోహిత్‌ మంజర నడుపుతున్నాడు. శనివారం ఉదయం 6.30 గంటలకు కరూర్‌ జిల్లా కుళితలై సమీపంలోని కె.పేట్టై బైపాస్‌ రోడ్డులో కారు వెళ్తోంది. అదే సమయంలో కరూర్‌ నుంచి ఇసుక లోడుతో తిరుచ్చి వైపు లారీ వేగంగా వస్తోంది. అకస్మాత్తుగా కారు – లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కారులోనివారు శిథిలాల్లో చిక్కుకుపోయారు. కేకలు విని స్థానికులు వారిని వెలుపలికి తీశారు. సమాచారం అందుకున్న కుళితలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 ప్రమాదంలో రోహిత్‌ మంజర (22), జరాల్డ్‌ మంజర (35), క్షత్రియన్‌ (30), ఆల్విన్‌ (40), రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కారు టైర్లు పేలిన కారణంగా అదుపుతప్పి లారీని ఢీకొని ఉండవచ్చని చెబుతున్నారు. ప్రమాదం కారణంగా కరూర్‌ – తిరుచ్చి రోడ్డుపై రెండు గంటలకు పైగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement