ముదురుతున్న ‘శివాజీ’ వివాదం | Sakshi
Sakshi News home page

ముదురుతున్న ‘శివాజీ’ వివాదం

Published Sat, Jan 25 2014 3:15 AM

ముదురుతున్న ‘శివాజీ’ వివాదం

చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని శివాజీ గణేశన్ విగ్రహ వివాదం మరింతగా ముదురుతోంది. విగ్రహాన్ని తొలగించాలని ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:
 తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత అంతటి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నడిగర్ తిలగం శివాజీ గణేశన్. ఎంజీఆర్‌పై అభిమానానికి గుర్తుగా నగరంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. బీచ్ వద్ద అతిపెద్ద సమాధి ఉంది. అలాగే శివాజీ గణేశన్ స్మృతి చిహ్నంగా 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం బీచ్ రోడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి హోదాలో కరుణానిధి ప్రారంభించారు. రోడ్డు కూడలిలో ఉన్నందున ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల వివాదం పుట్టుకొచ్చింది. విగ్రహాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీంతో అభిమానులు మద్రాసు హైకోర్టును ఆశ్రరుుంచారు. అక్కడ వాదోపవాదాలు పూర్తయి ఎట్టకేలకు విగ్ర హాన్ని అక్కడి నుంచి తొలగించి మరెక్కడైనా ప్రతిష్ఠించాలని హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
 
 వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
 కోర్టు తీర్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శివాజీ గణేశన్ అభిమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకరన్ వాదనలు వినిపిస్తూ తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అలాగే విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తీర్పుపై స్టే విధించేందుకు, ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తులు సతీష్‌కుమార్, అగ్రిహోత్రి, కేకే శచీంద్రన్ పేర్కొన్నారు. విగ్రహ తరలింపు అభ్యంతర పిటిషన్‌ను సాధారణ కేసుగా కొనసాగించుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా శివాజీ గణేశన్ కుమారులు రామ్‌కుమార్, ప్రభు శుక్రవారం తమ స్పందనను తెలిపారు.
 
 దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులు కలిగిన తమ తండ్రి విగ్రహం తరలింపుపై ప్రభుత్వం తగిన నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహం విషయంలో అభిమానులు ఆందోళనలు చేయవద్దని వారు కోరారు. శివాజీ గణేశన్ విగ్రహ వివాదం వెనుక అధికార పార్టీ దురుద్దేశం దాగి ఉందని డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యానించారు. శివాజీ విగ్రహాన్ని కరుణానిధి ప్రారంభించినందునే దాన్ని తొలగింపు కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి జీకే వాసన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా అభిమానులను అలరిస్తున్న శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం లేదన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement