సిద్ధు పదవికి ఎసరు! | Sakshi
Sakshi News home page

సిద్ధు పదవికి ఎసరు!

Published Sat, Oct 26 2013 3:21 AM

Sidhu esaru post!

 

ఖర్గే ఆవేదన
 = సిద్దయ్య పాలన బాగుంది
 = అతన్ని పదవీచ్యుతున్ని చేసేలా కుట్రలు
 = నేను ఎవరిపైనా ఆరోపణలు చేయను
 = అయితే.. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి
 = ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలి

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఉత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం కాదని హితవు పలికారు. యువజన కాంగ్రెస్ శుక్రవారం ఇక్కడ తన నివాసంలో సన్మానించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారని అడిగినప్పుడు, ఆయన నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

పాలక, ప్రతిపక్షాల్లోని వారు ఆయనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిర్దుష్టంగా తాను ఎవరి పైనా ఆరోపణలు చేయలేనని అన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు మంచివి కావన్నారు. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ముఖ్యమంత్రి తన పరిధిలో ఉత్తమ పనులు చేస్తున్నారని, మంచి పాలనను అందిస్తున్నారని కితాబునిచ్చారు. ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. కాగా మంత్రి సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్‌పై తాను కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు.

రాష్ట్రంలో  రైల్వే పథకాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. రాష్ర్టం వాటా 50 శాతం నిధులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని చెప్పారు. ప్రత్యేక హోదా పొందిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి సంతకం చేసినందున, ఆ ప్రాంత అభివృద్ధికి పచ్చ జెండా ఊపినట్లయిందని ఆయన అన్నారు.
 

Advertisement
Advertisement