‘రొటీన్’ కామెంట్! | Sakshi
Sakshi News home page

‘రొటీన్’ కామెంట్!

Published Thu, Jan 23 2014 11:53 PM

Somnath Bharti controversy: Delhi CM Arvind Kejriwal meets Lt Governor Najeeb Jung

 సాక్షి, న్యూఢిల్లీ:డామిట్... కథ అడ్డం తిరిగిందా? అందుకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిశారా? నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఎల్జీ-సీఎం సమావేశం జరిగిందా? గురువారంనాటి పరిణామాలపై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చలివి. మంత్రులు చెప్పినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలతో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు నగరంలో హల్‌చల్ చేసిన ముఖ్యమంత్రి ఎల్జీ అభ్యర్థన మేరకు వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అదే ఎల్జీతో తాను సమావేశం కావడంపై కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇచ్చినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి.
 
 నజీబ్ జంగ్‌తో దాదాపు 20 నిమిషాలపాటు సమావేశమైన కేజ్రీవాల్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ‘రొటీన్’గానే గవర్నర్‌తో సమావేశమయ్యానని, సోమ్‌నాథ్ భారతి వ్యవహారం తమ మధ్య చర్చకు రాలేదని తెలిపారు. అయితే ఆయన ప్రత్యర్థులు మాత్రం న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ తప్పించాల్సిందిగా వెల్లువెత్తుతున్న డిమాండ్లపై చర్చించి ఉంటారని చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా స్పందించాయి. ప్రతి బుధవారం గవర్నర్‌తో కేజ్రీవాల్ సమావేశమై ప్రభుత్వ వ్యవహారాల గురించి చర్చిస్తారని, అయితే ధర్నా అనంతరం ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో బుధవారం సమావేశం కాలేదని, ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో గురువారం సమావేశమయ్యారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్ కూడా ఎల్జీని  కలవడం వల్ల వారి సమావేశంలో సోమ్‌నాథ్ భారతి వ్యవహారం చర్చకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
 
 ఢిల్లీ పోలీసులకు కోర్టు చీవాట్లు
 ఢిల్లీ రాష్ట్ర న్యాయ మంత్రి సోమనాథ్ భారతి నేతృత్వంలో తమ ఇంటిపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఉగాండా మహిళ చేసిన ఫిర్యాదుపై స్పందించని రాష్ట్ర పోలీసులకు స్థానిక కోర్టు గట్టిగా చీవాట్లు పెట్టింది. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్య తీసుకోలేదని మండిపడింది. ఈ ఉదంతంపై దక్షిణ డీసీపీ కార్యాలయానికి ఫిర్యాదు అందిందో, లేదో, అంది ఉంటే ఏ చర్యలు తీసుకున్నారో ఈ నెల 25లోగా తమకు వివరణ ఇవ్వాలని సదరు డీసీపీని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేతానా సింగ్ గురువారం ఆదేశించించారు. ‘మాకందిన పిటిషన్‌లో చాలా ఆరోపణలు ఉన్నాయి. మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు స్వీకరించింది. అయినా వారు చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు. పిటిషన్‌పై మేం ఆదేశాలిచ్చేముందు డీసీసీ నుంచి సమాధానం కావాలి’ అని పేర్కొన్నారు.ఈ నెల 15న అర్ధరాత్రి సోమనాథ్ భారతి నేతృత్వంలో తమ ఫ్లాట్‌పై దాడి చేసి, అనుచితంగా ప్రవర్తించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చే యాలని ఉగాండా మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరో అఫ్రికన్ మహిళతోపాటు మరొకరు వేసిన పిటిషన్లపై స్పందించిన కోర్టు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
 

Advertisement
Advertisement