స్పెషల్ బస్సులు రెడీ | Sakshi
Sakshi News home page

స్పెషల్ బస్సులు రెడీ

Published Sat, Jan 10 2015 1:56 AM

Special buses will

రోడ్డెక్కనున్న ఏడువేల బస్సులు
నేటి నుంచి పరుగులు
కోయంబేడులో ప్రత్యేక  కౌంటర్లు

 
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు రాష్ర్ట రవాణాశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ బస్సులు శనివారం నుంచి పరుగులు తీయనున్నాయి. టికెట్ రిజర్వేషన్  నిమిత్తం కోయంబేడులో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
 
చెన్నై: సంక్రాంతి వచ్చిందంటే సంబరాలే. భోగి, సంక్రాంతి, పశువుల పండుగ రోజుల్లో గ్రామగ్రామాన సందడే. ఈ పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకునేందుకు ఎక్కడెక్కడి వారు సొంత గ్రామాలకు చేరుకుంటుంటారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రైల్వే యంత్రాంగం చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల వైపుగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి. అన్ రిజర్వుడ్‌లో ఇసుకేస్తే రాలనంతగా జనం పయనించాల్సి ఉంది. అలాగే ఆమ్నీ బస్సుల దోపిడీ రెట్టింపు అవుతోంది. ప్రయాణికుల ఇబ్బందుల్ని గుర్తెరిగిన రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ నేతృత్వంలో ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు సిద్ధమైంది.

నేటి నుంచి పరుగులు

చెన్నై కోయంబేడు బస్ టెర్మినల్ నుంచి సాధారణంగా నడిచే బస్సులతోపాటుగా సంక్రాంతి స్పెషల్‌గా 7250 బస్సుల్ని నడిపేందుకు నిర్ణయించారు. చెన్నై నుంచి అన్ని జిల్లా కేంద్రాల కు, నగరాలు, పట్టణాలకు ఈ బస్సులను నడపనున్నారు. అలాగే ఆయా జిల్లా కేంద్రాలు, నగరాల నుంచి ఇతర ప్రాంతా లకు, చెన్నైకి అదనపు బస్సులు పయనించనున్నాయి. సంక్రాంతికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ దృష్ట్యా శనివారం నుంచే బస్సుల్ని నడిపేందుకు రంగం సిద్ధమైంది. చెన్నై నుంచి శనివారం 600, 11న 470, 12న 720, 13న 1408, 14న 1456 బస్సుల్ని నడపనున్నారు. ఈ నెల 15న ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సుల్ని రోడ్డెకించనున్నారు. శనివారం నుంచి ఇతర ప్రాంతాల నుంచి చెన్నై, తదితర ప్రాంతాలకు 300 బస్సులు, 11న 400, 12న 500, 13న 595, 14న 800 వందలు బస్సులు రోడ్డెక్కనున్నాయి. పండుగను ముగించుకుని తిరుగు పయనం అయ్యే వారికి కోసం 16 నుంచి 19వ తేదీ వరకు పై సంఖ్యలోనే బస్సులు పరుగులు తీస్తాయి.  300 కిమీ పైబడి పయనించేవారు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కోయంబేడు బస్టాండ్ ఆవరణలో 25 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.

చెన్నై నగరంలో..

 చెన్నై మహానగరంలోనూ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచి నగర వాసులు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం ఆనవాయితీ. కనుమ, ముక్కనుమ రోజుల్లో పర్యాటక కేంద్రాలు జన సందోహంతో నిండి ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోయంబేడు, ప్యారిస్, టీ.నగర్, తాంబరం తదితర ప్రధాన బస్టాండ్ల నుంచి కోవళం, మహాబలిపురం, ముట్టుకాడు, పళ్లికర నై, వీజీపీ, కిష్కిందా, క్వీన్స్ లాండ్, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లు తదితర పర్యాటక కేంద్రాల మీదుగా 250 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు.
 

Advertisement
Advertisement