బలపడిన ద్రోణి | Sakshi
Sakshi News home page

బలపడిన ద్రోణి

Published Mon, Jan 6 2014 4:16 AM

బలపడిన ద్రోణి

సాక్షి, చెన్నై: గత ఏడాది రాష్ట్రంలో వర్షపాతం అంతంత మాత్రమే. నైరుతీ, ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేసినా, పైలీన్, హెలెన్, లెహర్, మాదీ తుపానుల రూపంలో ఓ మోస్తరుగా వర్షం పడింది. రెండు రోజుల క్రితం బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బల పడుతుండటంతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాదిలోని సముద్ర తీర జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. 
 
 తంజై, నాగైలలో వర్షం: బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో నెలకొన్న ఈ ద్రోణి ఆదివారం వాయుగుండంగా మారింది. శ్రీలంక తీరంలోని యాల్పానం సమీపంలో కేంద్రీ కృతమైన ఈ ద్రోణి రాష్ట్రం వైపు పయనించే అవకాశం కనిపిస్తోంది. గంటకు 45 -65 కి.మీ వేగంతో దూసుకొస్తున్న ఈ ద్రోణి ప్రభావంతో తంజావూరు, నాగపట్నం జిల్లాల్ని వర్షం ముంచెత్తుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలలు ఎగసి పడుతుండటంతో ఆదివారం జాలర్లు చేపల వేటకు దూరంగా ఉన్నారు. సముద్ర తీరవాసుల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ జిల్లాల్లో  ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారు.  కెరటాల జడి: ఈ ద్రోణి ప్రభావంతో సముద్ర తీర జిల్లాలు తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, కడలూరు, నాగప్పటం, తిరువారూర్, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉంది.  తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో అయితే, అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ  కెరటాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. 
 
 కెరటాల తాకిడి పెరుగుతుండటంతో పడవల్ని భద్ర పరిచే పనిలో జాలర్లు పడ్డారు. నడి సముద్రంలోకి వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో మర పడవలు, మోటార్ బోట్ల పడవలు కలిగిన జాలర్లు అప్రమత్తమయ్యారు. రామేశ్వరం, నాగై, పాంబన్, పుదుచ్చేరి తదితర హార్బర్‌లలో ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు.   వాతావరణ కేంద్రం డెరైక్టర్ రమణన్ పేర్కొం టూ, ద్రోణి బలపడిందన్నారు. వాయుగుండంగా మారిన ఈ ద్రోణి మరింత బలపడి తుపానుగా మారేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని సముద్ర తీర జిల్లాల్లో అత్యధిక శాతం వర్షం పడే అవకాశాలున్నాయని చెప్పారు. మరో 48 గంటల్లో భారీ వర్షాల్ని చూడొచ్చన్నారు. ఈ ద్రోణి తమిళనాడు వైపుగానే పయనిస్తోందని తెలిపారు. గాలుల ప్రభావం క్రమంగా పెరుగుతోందని, అలలు మరింతగా ఎగసి పడనున్న దృష్ట్యా, జాలర్లు నడి సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. 

Advertisement
Advertisement