రేపు రాష్ట్ర బంద్ | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్ర బంద్

Published Wed, Sep 14 2016 1:46 AM

రేపు రాష్ట్ర బంద్ - Sakshi

 నేడు కావేరీ హక్కుల ర్యాలీ
 వివిధ పార్టీల పోరుబాట

 
 సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరీ జల వివాదాన్ని మరింత జఠిలంగా మార్చిన కర్ణాటక ప్రభుత్వాన్ని నిరసిస్తూ, తమిళులపై దాడులను ఖండిస్తూ ఈనెల 15వ తేదీన బంద్ పాటించాలని తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు ధనపాలన్ మంగళవారం ప్రకటించారు. బెంగళూరులో తమిళనాడు బస్సులను దహనం చే సినందుకు ప్రతీకారంగా మంగళవారం రాష్ట్రంలో పలు ఆందోళనలు, విధ్వంసాలు సాగాయి. కర్ణాటక వాహనదారులు తమిళనాడు నంబరు ప్లేట్లను తగిలించుకుని తిరుగుతున్నారు. కర్ణాటక బ్యాంకులు, కార్యాలయాలకు బందోబస్తు చేసినా అనేక చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయారు.
 
  చెన్నైలో 171 కర్ణాటక కార్యాలయాలకు 68 హోటళ్లకు, 66 ఎంటీఎంలకు పోలీసు బందోబస్తు పెట్టారు. కోయంబత్తూరు జిల్లా గాంధీపురం నుంచి గరుడాలయా సంస్థకు చెందిన ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ బస్సు 21 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి చెన్నైకి బయలుదేరింది. అర్ధరాత్రి బస్సును అడ్డగించిన ఇద్దరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో బస్సు ముందు భాగంలోని రెండు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిలో నిలిచి ఉన్న ఒక జీపును ధ్వంసం చేశారు. కావేరీ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని ఆందోళనకారులు కర్ణాటక బ్యాంకులపై గురిపెట్టారు.
 
  విరుగంబాక్కంలోని కర్ణాటక బ్యాంకు ముందు తమిళగ వాళ్వురిమై కట్చి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై తంగశాలైలో మణిగుండు సమీపంలోని కర్ణాటక బ్యాంకు ఏటీఎం ఉంది. మంగళవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో బైక్‌లో హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఏటీఎంపై రాళ్లు వేసి అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే ఏళుకిన్రులోని కర్ణాటక బ్యాంకు ఏటీఎంను పూర్తిగా ధ్వంసం చేశారు. కోయంబేడులో కర్ణాటక బస్సు అద్దాలు పగులగొట్టి పాక్షికంగా ధ్వంసం చేశారు. మైలాపూర్‌లోని సంగీత హోటల్‌లోకి 12 మంది నామ్‌తమిళర్ కట్చి కార్యకర్తలు జొరబడి ఫర్చిచర్ ధ్వంసం చేశారు. శ్రీపెరంబుదూరు చెక్‌పోస్టు సమీపంలో కర్ణాటక లారీకి దుండగులు నిప్పుపెట్టారు.
 
 వాహనాలకు బ్రేక్:
 కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగని దృష్ట్యా తమిళనాడు సరిహద్దుల్లో మంగళవారం సైతం వాహనాలను నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు మాత్రమేగాక కార్లను సైతం కార్లను సైతం అనుమతించలేదు. ఈ రోడ్డు జిల్లా సత్యమంగళం మీదుగా కర్ణాటకకు వెళ్లే వాహనాలను మాపన్నారీ చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. బెంగళూరు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తమ రిజర్వేషన్ చార్జీలను తిరిగి చెల్లించాలని అనేక చోట్ల డిమాండ్ చేశారు. అయితే బస్సు యాజమాన్యాలు ఇందుకు నిరాకరించడంతో గొడవలు ఏర్పడ్డాయి.
 
 పార్టీల పోరుబాట:
 కావేరీ వివాదంపై ఈనెల 18వ తేదీన డీఎంకే అధ్యక్షులు కరుణానిధి పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశం అవుతున్నారు. పరిష్కారానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ చర్చలు జరపాలని డీఎంకే కోశాధికారి, ప్రతిపక్షనేత స్టాలిన్ సూచించారు. కర్ణాటకలో తమిళులపై దాడులు ఆగలాంటే సీఎం జయలలిత అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ ఈనెల 16వ తేదీన నిరాహారదీక్ష చేపడుతున్నట్లు డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ మంగళవారం ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయం ముందు దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
 
 కావేరీ మేనేజిమెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన ఆరు జిల్లాల్లో రోడ్డు రోకో, రైల్‌రోకో నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. కర్ణాటకలో తమిళుల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16వ తేదీన రైల్‌రోకో నిర్వహిస్తున్నట్లు వీసీకే అధ్యక్షులు తిరుమా ప్రకటించారు. కావేరీ హక్కుల సాధన ర్యాలీని బుధవారం నిర్వహిస్తున్నట్లు నామ్ తమిళర్ క ట్చి అధ్యక్షులు సీమాన్ మంగళవారం ప్రకటించారు. కావేరీ వివాదాన్ని అక్కడి ప్రభుత్వం రాజకీయం చేసి చోద్యం చూస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement