అమ్మ అంత్యక్రియల్లోనూ అదే తీరు | Sakshi
Sakshi News home page

అమ్మ అంత్యక్రియల్లోనూ అదే తీరు

Published Thu, Apr 24 2014 2:16 AM

Stir son stalwarts

  •  బంగారప్ప తనయుల గొడవ
  •  అనుచరులతో సహా బాహాబాహీకి యత్నం
  •  సన్నిహితుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
  •  బంగారప్ప అంత్యక్రియల్లోనూ ఇంతే
  •  శివమొగ్గ, న్యూస్‌లైన్ : రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుటుంబ కలహం మరో సారి రచ్చకెక్కింది. బంగారప్ప సతీమణి శకుంతలమ్మ అంత్యక్రియల సందర్భంగా బుధవారం ఆమె తనయులు కుమార, మధు బంగారప్పలు దాదాపు బాహాబాహీకి సిద్ధపడగా, వారి అనుచరులు కూడా తమ నాయకుల బాటలోనే నడిచారు. బంగారప్ప కుటుంబ సన్నిహితులు, శ్రేయోభిలాషులు జోక్యం  చేసుకుని గొడవ మరింత పెద్దది కాకుండా నివారించగలిగారు.

    బంగారప్ప అంత్యక్రియల్లోనూ ఆయన కుమారులిద్దరు గొడవ పడిన సంగతి తెలిసిందే. శకుంతలమ్మ పార్థివ శరీరాన్ని బుధవారం అంతిమ దర్శనం కోసం ఉంచినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అంత్య సంస్కారాలను నిర్వహిస్తున్న సందర్భంలో మధు బంగారప్పతో పాటు సోదరి గీతా శివ రాజ్ కుమార్, కుటుంబ సభ్యులు అనిత, సుజాతలు ఓ పక్క నిలబడి ఉన్నారు. కుమార బంగారప్ప మరో వైపు నిల్చుని శ్రాద్ధ కర్మలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.
     
    ఆదిలోనే గొడవ

     
    ఉదయం కుమార బంగారప్ప తన కుటుంబ సభ్యులతో సొరబ తాలూకా కుబటూరు నివాసానికి వచ్చిన సమయంలో మధుతో మాటా.. మాటా పెరిగింది. గీతా సైతం కుమార వెంట వచ్చిన బంధువుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మధు, కుమారల వర్గీయులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిద్దరినీ చెరో వైపు తీసుకెళ్లారు. వారి మద్దతుదారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఇద్దరూ అంత్య సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ శ్రేయోభిలాషులు సూచించడంతో గొడవ సద్దుమణిగింది.
     
    అంతిమ దర్శనం

    బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం కన్ను మూసిన శకుంతలమ్మను వాహనంలో కుబటూరుకు బుధవారం అర్ధరాత్రి తీసుకు వచ్చారు. బంగారప్ప నివాసంలో పార్థివ శరీరాన్ని ఉంచి తుది దర్శనానికి అవకాశం కల్పించారు. అనంతరం వాహనంలో భౌతిక కాయాన్ని సొరబ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానానికి తరలించి ప్రజల దర్శనానికి అవకాశం కల్పించారు. బంగారప్ప అంతిమ సంస్కారాలను  నిర్వహించిన స్థలం వద్దే శకుంతలమ్మ చితికి నిప్పంటించారు. సాయంత్రానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement