మీ నిర్ణయమే నా ప్రాణాలు తీసింది..! | Sakshi
Sakshi News home page

మీ నిర్ణయమే నా ప్రాణాలు తీసింది..!

Published Sat, Dec 17 2016 4:27 AM

మీ నిర్ణయమే నా ప్రాణాలు తీసింది..! - Sakshi

పెద్దనోట్ల రద్దుపై మోదీకి లేఖరాసి ఓ వ్యక్తి ఆత్మహత్య

సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం రూరల్‌: ‘నరేంద్ర మోదీ గారూ.. మీరు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కాని ఒక సామాన్యుడి ప్రాణం తీసింది. ఎందుకంటే నేను అప్పుల్లో ఉన్నాను. మీ నిర్ణయం పుణ్యమా అని ఒక్క రూపాయి కూడా దొరకక, చీటీలు కట్టలేకపోయాను. ఇంతవరకు ఎంతో గౌరవంగా బతికేవాడిని. ఎవరిదగ్గరా మాట పడలేదు. ఇప్పుడు అప్పు ఇచ్చేవారు లేక ఎవరికీ సమాధానం చెప్పలేక చనిపోతున్నాను. నా భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులకు ఏదైనా ఉపకారం చేయండి’ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ. పెద్ద నోట్ల మార్పిడి ఎంత ప్రభావం చూపిందన్నది వ్యాపారి మనోవేదన కళ్లకు కడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన పోలిశెట్టి నరసింహమూర్తి(నాని) స్థానికంగా తాపీ పని చేసుకుంటూ, చీటీలు కట్టుకుంటూ కుటుం బాన్ని పోషించుకునేవాడు.

పెద్ద నోట్ల రద్దుతో రావా ల్సిన డబ్బులు ఆగిపోవడం, వేసిన చీటీలకు జనం నుంచి డబ్బులు వసూలు కాకపోవడం, తాను ఇవ్వవలసిన వారికి డబ్బులు ఇవ్వలేకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం తెలంగాణ లోని వరంగల్‌ జిల్లా హన్మకొండకు వెళ్లి ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నోట్ల రద్దు వల్ల తాను ఇబ్బందులు పడ్డానని, అప్పులు తీర్చగలిగినన్ని తీర్చానని, ఇంకా తీర్చలేకపోవడంతో వారికి మొ హం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను అనాథ శవంగా కాకుండా తన ఇంటికి శవాన్ని పంపించాలంటూ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, మోదీ నిర్ణయం వల్ల జీవించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం తెలంగాణ పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. గురువారం స్వగ్రామం కొప్పర్రులో నరసింహమూర్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. లేఖలోని దస్తూరి నరసింహమూర్తిదేనని అతని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

Advertisement
Advertisement