రామ్‌కుమార్‌ను ఇరికించారు | Sakshi
Sakshi News home page

రామ్‌కుమార్‌ను ఇరికించారు

Published Tue, Jul 12 2016 8:24 AM

రామ్‌కుమార్‌ను ఇరికించారు

ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ను ఇరికించినట్టుందని ఆయన తరఫు న్యాయవాది రామరాజ్ వ్యాఖ్యానించారు. రామ్‌కుమార్ నిర్దోషి అంటూ వకాల్తా పుచ్చుకున్నారు. కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం చెన్నై హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో పడ్డారు. స్వాతిని హతమార్చింది రామ్‌కుమార్ అన్నది నిర్ధారించుకునేందుకు తగ్గట్టుగా పుళల్ చెరలో మంగళవారం ఐడెండిఫికేషన్ జరగనుంది.
 
* రామ్‌కుమార్ తరఫు వకాల్తా పుచ్చుకున్న న్యాయవాది రామ్‌రాజ్ వ్యాఖ్య
* ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసును వెంటనే సీబీఐకు అప్పగించాలని డిమాండ్
* దీనిపై కోర్టుకు వెళ్లనున్న నిందితుడి తండ్రి పరమశివం
* నేడు పుళల్‌లో ఐడెంటిఫికేషన్


సాక్షి, చెన్నై: గత నెల నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైన విష యం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిఘా నేత్రాల సాయంతో నిందితుడ్ని ఎట్టకేలకు గుర్తించారు. తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షి పురానికి చెందిన రామ్‌కుమార్‌ను హంతకుడిగా తేల్చి అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో సాగిన ఈ అరెస్టు పర్వంతో పుళల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రామ్‌కుమార్ ఉన్నాడు. అరెస్టు క్రమంలో గొంతు కోసుకున్న దృష్ట్యా అతడిపై పోలీసు వర్గాలు నిఘా పెట్టాయి. అయితే రామ్‌కుమార్‌కు స్వాతి హత్యకేసుతో సంబంధం లేదని, కేసును ముగించేందుకు పనిగట్టుకుని అరెస్టు చేశారన్న ఆరోపణలు మొదలయ్యాయి. రామ్‌కుమార్‌కు అనుకూలంగా తొలుత కృష్ణమూర్తి అనే న్యాయవాది ముందుకు వచ్చినట్టు వచ్చి, వెనక్కు తగ్గారు.

తదుపరి రామరాజ్ అనే న్యా యవాది వకాల్తా పుచ్చుకున్నారు. సోమవారం రామ్‌కుమార్‌ను రామరాజ్ నేతృత్వంలోని న్యాయవాద బృం దం కలిసినట్టు సమాచారం. రామ్‌కుమార్ బెయిల్ విషయంపై కేసు విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు సమావేశమైనట్టు తెలిసింది. 
ఈ సందర్భంగా న్యాయవాది రామరాజ్ మాట్లాడుతూ కేసును త్వరితగతిన ముగించడం కోసం అమాయకుడైన రామ్‌కుమార్‌ను ఇరికించారని మీడియా ముందు వ్యాఖ్యానించారు.

తన కుమారుడ్ని అన్యాయంగా అరెస్టు చేశారని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించేందుకు రామ్‌కుమార్ తండ్రి పరమశివం సిద్ధం అయ్యారు. న్యాయవాదుల బృందంతో సంప్రదింపుల్లో పడ్డారు. తన కుమారుడు అమాయకుడు అని, తప్పకుండా బయటకు వస్తాడంటూ రామ్‌కుమార్ తల్లి పుష్పం వ్యాఖ్యానించారు.
 
ఐడెంటిఫికేషన్: స్వాతి హత్యకేసులో పట్టుబడ్డ రామ్‌కుమార్‌ను గుర్తించేందుకు ఐడెంటిఫికేషన్‌కు చర్యలు తీసుకున్నారు. తొలుత హత్యను చూసినట్టు ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు ధైర్యం చేసి పలువురు  ముందుకు వచ్చారు. వీరిని పుళల్ జైలుకు తీసుకెళ్లి రామ్‌కుమార్‌ను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం న్యాయమూర్తి సమక్షంలో పుళల్ జైల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తదుపరి రామ్‌కుమార్‌ను కస్టడీకి తీసుకునేందుకు తగ్గ పిటిషన్‌ను నగర పోలీసులు కోర్టులో దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement