కామన్వెల్త్ ఉద్యమానికి తమిళ సంఘాల కసరత్తు | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ ఉద్యమానికి తమిళ సంఘాల కసరత్తు

Published Tue, Aug 20 2013 6:32 AM

Tamil communities in the Commonwealth movement exercise

శ్రీలంకలో కామన్వెల్త్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఉద్యమం జీవం పోసుకోనుంది. ఉద్యమం దిశగా ఈలం మద్దతు తమిళాభిమాన సంఘాలు తలమునకలయ్యాయి. సమావేశాలను భారత్ బహిష్కరించాల్సిందేనని రాజకీయ పక్షాలన్నీ గళం విప్పాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుం టారోనన్న ఉత్కంఠ నెలకొంది.
 
 సాక్షి, చెన్నై: శ్రీలంకలో ఈలం తమిళుల్ని యుద్ధం పేరుతో మట్టు బెడుతున్న సమయంలో తమిళనాట ఆగ్రహం పెల్లుబికింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను అంతర్జాతీయ న్యాయస్థానం బోనులో నిలబెట్టడం లక్ష్యంగా మహోద్యమం సాగింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా తీర్మానం నెగ్గినా ఈలం తమిళులకు ఒరిగింది శూన్యమని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తమిళనాడులోని ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు గుర్రుగా ఉన్నాయి. ఈలం తమిళులకు సమాన అవకాశాలు కల్పించాలన్న నినాదంతో ఉద్యమిస్తున్నాయి. 
 
 నవంబర్‌లో సమావేశాలు
 శ్రీలంకలో నవంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు కామన్వెల్త్ సమావేశాలు జరగనున్నాయి. కామన్వెల్త్ దేశాల్లో భారత్ సైతం ఉంది. ఇక్కడి నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ లేదా ఆయన దూత సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలను భారత్ బహిష్కరించాలన్న నినాదం రాష్ట్రంలో ఊపందుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావలన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్ గళం విప్పారు. అలాగే ఈలం మద్దతు సంఘాలు, తమిళాభిమాన సంఘా లు నిరసన తెలిపాయి. సమావేశాలకు ఇంకా సమయం ఉన్న దృష్ట్యా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. స్థానిక కాంగ్రెస్ నేతల మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు.
 
 ప్రధానికి ఆహ్వానం
 శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సి.ఎల్.పెరిస్ సోమవారం ఢిల్లీకి వచ్చారు. కామన్వెల్త్ సమావేశాలకు రావాలంటూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై ఒత్తిడి పెంచే దిశగా తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే నిరసనకు డీఎంకే పిలుపునిచ్చింది. మిగిలిన పక్షాలూ అదేబాటలో పయనించేందుకు సమాయత్తం అవుతున్నాయి. నల్లజెండాల ప్రదర్శన, రైల్‌రోకో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
 
 ఉభయసభల్లో ఫైట్
 శ్రీలంక ఆహ్వానాన్ని తిరస్కరించాలంటూ ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్‌లు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను డిమాండ్ చేశారు. ఈలం తమిళుల సమస్య, జాలర్లపై దాడుల్ని ఎత్తి చూపుతూ సమావేశాల్ని బహిష్కరించాల్సిందేనని లేఖాస్త్రాలు సంధించారు. ఈ వివాదం ఉభయ సభలనూ సోమవారం తాకింది. కామన్వెల్త్ సమావేశాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే, డీఎంకే, సీపీఐ రాజ్యసభలో గళం విప్పాయి. అన్నాడీఎంకే సభ్యుడు మైత్రేయన్, డీఎంకే సభ్యురాలు కనిమొళి, సీపీఐ సభ్యుడు రాజా కేంద్రంపై విరుచుకుపడ్డారు. అలాగే లోక్‌సభలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మొత్తం మీద ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
 

Advertisement
Advertisement