విజయ్‌ రాజకీయ ప్రవేశం ఉంటుందా? | Sakshi
Sakshi News home page

విజయ్‌ రాజకీయ ప్రవేశం ఉంటుందా?

Published Sat, Mar 25 2017 8:41 AM

విజయ్‌ రాజకీయ ప్రవేశం ఉంటుందా?

చెన్నై‌: తమిళ సినీప్రేక్షకుల మధ్య ఇళయ దళపతిగా అభిమానం పొందుతున్న ప్రముఖ నటుడు విజయ్‌. ఇటీవల కాలంలో చాలా మంది సినిమా తారలు రాజకీయ రంగప్రవేశం చేసి, కరుణాస్‌ లాంటి వారు శాసన సభ్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే చాలా కాలం క్రితమే నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి ఆ తరువాత వెనక్కు తగ్గారు. తమిళనాట ప్రస్తుత పరిణాల్లో విజయ్‌ రాజకీయ తెరంగేట్రం చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తండ్రి, సీనియర్‌ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ శుక్రవారం కన్యాకుమారిలో బదులిస్తూ నటుడు రాజకీయాల్లోకి రావడం సులభమేనన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారాయని పేర్కొన్నారు.

గత 10 ఏళ్ల క్రితం తాను విజయ్‌ రాజకీయ రంగప్రవేశానికి ప్రయత్నించానన్నారు. అయితే ఇప్పటి రాజకీయ వ్యాపారం పరిస్థితుల్లో విజయ్‌ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానన్నారు. త్వరలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ చట్ట నిబంధనల ప్రకారం నటుడైనా, నిర్మాత అయినా నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చంద్రశేఖర్‌ అన్నారు.

అయితే తమకున్న విధి విధానాల ప్రకారం ఒక సంఘానికి ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూ, మరో సంఘంతో అదే స్థాయి పదవీ బాధ్యతల్ని నిర్వహించడం సాధ్యం కాదని పరోక్షంగా నటుడు విశాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో పైరసీని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు పోలీసు అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నాయని, తమిళ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 

Advertisement
Advertisement