ముడుపులపై చర్చకు డీఎంకే పట్టు | Sakshi
Sakshi News home page

ముడుపులపై చర్చకు డీఎంకే పట్టు

Published Thu, Jun 15 2017 1:50 AM

Tamil Nadu Assembly Speaker not allowed DMK Allegations

అనుమతించని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకే సభ్యులు కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయారనే ఆరోపణలపై తమిళనాడు అసెంబ్లీ బుధవారం అట్టుడుకిపోయింది. దీనిపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్ష డీఎంకే పట్టుబట్టింది. కానీ స్పీకర్‌ అనుమతించకపోవడంతో  డీఎంకే, అధికార పక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ముడుపుల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ.. ఎమ్మెల్యేల వ్యవహరం న్యాయస్థానంలో ఉన్నందున చర్చకు తావిస్తే కోర్టు ధిక్కారం అవుతుందని చెప్పారు. దీంతో ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్‌ ఆదేశించారు. ఇంతలో డీఎంకే, కాంగ్రెస్, ముస్లీం లీగ్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. స్పీకర్‌ వైఖరికి నిరసనగా స్టాలిన్‌ సహా ప్రతిపక్ష సభ్యులంతా సచివాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో జరిపారు.  

Advertisement
Advertisement