జాలర్ల సమ్మెబాట | Sakshi
Sakshi News home page

జాలర్ల సమ్మెబాట

Published Thu, Nov 7 2013 4:45 AM

Tamil Nadu BJP leaders to apprise leadership on sentiments against Commonwealth meet in Sri Lanka

 సాక్షి, చెన్నై : కామన్వెల్త్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర జాలర్లను శ్రీలంక నావికాదళం బందీలుగా పట్టుకెళ్లడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఓ వైపు విద్యార్థులు, ప్రజా సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనల బాట పట్టారు. జాలర్లు సైతం ఆందోళనకు సిద్ధమయ్యారు. పుదుకోట్టై, రామేశ్వరం జాలర్లను బందీలుగా శ్రీలంక సేనలు పట్టుకెళ్లడంతో అక్కడి జాలర్లలో ఆగ్రహావేశాలు బయలుదేరాయి. తమ వాళ్ల విడుదలకు చర్యలు తీసుకోవాలని, కామన్వెల్త్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామేశ్వరం, పుదుకోట్టై జాలర్లు బుధవారం నుంచి సమ్మెబాట పట్టారు. చేపల వేటను బహిష్కరించారు. పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఈ విషయంగా జాలర్ల సంఘం నేత రామదేవన్ మాట్లాడుతూ జాలర్లపై శ్రీలంక సేనల దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 బందీలుగా పట్టుకెళ్లిన వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కేంద్రం సూచనతో విడుదల చేస్తున్నారు గానీ, తమ పడవల్ని మళ్లీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పడవలు లేక బతుకు భారమై వందలాది కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయని వాపోయారు. దాడులకు అడ్డుకట్ట వేయడం, కామన్వెల్త్‌ను బహిష్కరించి శ్రీలంక భరతం పట్టడం లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. తాము సమ్మెబాట పట్టామని, తమ వెంట అన్ని జిల్లాల్లోని జాలర్లు నడుస్తారన్న నమ్మకం ఉందన్నారు. పీఎంకే నేత రాందాసు మాట్లాడుతూ రామేశ్వరం, పుదుకోట్టై జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ జాలర్లను ఆదర్శంగా చేసుకుని సముద్ర తీర జిల్లాల్లోని జాలర్లందరూ ఏకం కావాలన్నారు. కేంద్రం నడ్డి విరిచి శ్రీలంక భరతం పట్టేలా చేసేందుకు ఇదే సరైన సమయమని జాలర్లకు పిలుపునిచ్చారు.
 
 విద్యార్థుల ఆమరణ దీక్ష
 కామన్వెల్త్ బహిష్కరణ నినాదంతో చెన్నైలో మూడు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం ఉదయం వళ్లువర్ కోట్టం వద్ద ఓ కళాశాలకు చెందిన సెంబియన్, ఇళవరసన్, రత్నవేల్ ఆమరణదీక్షకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి సాయంత్రం వరకు ఓ కల్యాణ మండపంలో ఉంచి అనంతరం విడుదల చేశారు. బయటకు వచ్చిన ఆ ముగ్గురు అన్నాసాలైలోని తమ హాస్టల్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు. అలాగే పెరంబూరు, కీల్పాకం ఆ పరిసరాల్లోని కళాశాలలకు చెందిన విద్యార్థులు ఓ ప్రైవేటు స్థలంలో దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష గురించి విద్యార్థి సెంబియన్ మీడియాతో మాట్లాడుతూ ఈలం తమిళుల సంక్షేమాన్ని కోరుతూ మూడు కళాశాలకు చెందిన మిత్రులందరూ కలిసి ఆయా ప్రాంతాల్లో దీక్ష చేపట్టామన్నారు. కామన్వెల్త్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటన చేసే వరకు తమ దీక్ష కొనసాగుతుందని, అన్ని కళాశాలల విద్యార్థుల్ని ఏకం చేసి ఆందోళనలు ఉద్ధృతం చేయనున్నామన్నారు. 
 
 బీజేపీ ఢిల్లీ బాట
 దేశ ప్రయోజనాల దృష్ట్యా కామన్వెల్త్ మహానాడులో భారత్ పాల్గొనాలని బీజేపీ జాతీయ నేతలు పేర్కొంటున్నారు. అదేవిధంగా మహానాడు వేదికగా తమిళ వాణి విన్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కామన్వెల్త్ మహానాడును బహిష్కరించాల్సిందేనన్న నినాదంతో రాష్ట్రంలో ఉద్యమం రాజుకుంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు మేల్కొన్నారు. తాము కామన్వెల్త్ మహానాడుకు అనుకూలంగా వ్యవహరిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ ఇరకాటంలో పడుతామోనన్న బెంగ వారికి పట్టుకుంది. దీంతో తమ స్వరాన్ని మార్చాలంటూ జాతీయ నేతలకు సూచించేందుకు రాష్ట్ర నాయకులు సిద్ధమయ్యారు. ఢిల్లీ బాట పట్టేందుకు ఉరకలు తీస్తున్నారు. ఈ విషయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్‌రాధాకృష్ణన్ మాట్లాడుతూ కామన్వెల్త్‌ను బహిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు. తన నేతృత్వంలో ఢిల్లీకి బృందం పయనం కానుందన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపి కామన్వెల్త్‌కు వ్యతిరేకంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొనడం గమనార్హం. 
 

Advertisement
Advertisement