అనర్హత ఎమ్మెల్యేలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

అనర్హత ఎమ్మెల్యేలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published Wed, Jun 20 2018 12:55 PM

Tamil nadu Minister Dindigul Srinivasan Sensational Comments On Disqualification MLAs - Sakshi

సంచలన వ్యాఖ్యలు, విమర్శలకు కేంద్రబిందువైన రాష్ట్ర అటవీశాఖ మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్‌ మరోసారి మాటల బాంబు పేల్చారు. ఈసారి ఏకంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితపైనే విసిరారు. కోట్లు కొల్లగట్టిన జయలలిత ధనం దినకరన్‌ ద్వారా పొంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని అనర్హత వేటుపడిన 18 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: దిండుగల్లులో సోమవారం రాత్రి జరిగిన కావేరి నదీ జలాల పోరాట విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హతవేటు కేసును విచారించిన ఇరువురు న్యాయమూర్తుల్లో చెల్లుతుందని ఒకరు, చెల్లదని ఒకరు తీర్పు చెప్పారు. కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. మూడో న్యాయమూర్తి సైతం  వేటును సమర్థ్దిస్తే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఆ తరువాత ఫుల్‌బెంచ్‌కు మొరపెట్టుకోవచ్చు. ఈలోగా నాలుగైదు ఏళ్లు గడిచిపోతాయి. చివరి నిమిషంలో అప్పీలు పిటిషన్‌ను వెనక్కుతీసుకుంటామని వేటుపడిన ఎమ్మెల్యేల్లో ఒకరైన తంగతమిళ్‌సెల్వన్‌ ప్రకటిస్తారు. అంటే స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం సరైనదనే కదా. జయలలిత మరణం తరువాత పార్టీని రెండుగా చీల్చిన దినకరన్‌ వెంట 18 మంది ఎమ్మెల్యేలు నడవడం ద్రోహం. జయ వల్ల పార్టీ నుంచి తొలగించబడిన ద్రోహి దినకరన్‌. జయలలిత తన స్వేదం, రక్తాన్ని చిందించి, ఎంతోధనం ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలందరినీ గెలిపించింది. ఈ 18 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ నాశనం కాదు.

వివాదాస్పద వ్యాఖ్యలు:
జయలలిత చలువతో కోట్లు గడించిన దినకరన్‌ నుంచి భారీస్థాయిలో ఆర్థిక లబ్ధి పొంది ఎన్నికల్లో గెలుపొందిన 18 మంది ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ ప్రభుత్వాన్నే కూలదోసేందుకు కుట్రపన్నుతున్నారు. వేటు పుణ్యమాన్ని మైసూరు, అమెరికాల్లో విహారయాత్ర చేçస్తుంటే చూస్తూ ఊరుకోలేమని ఆయన అన్నారు. జయలలితను అడ్డుపెట్టుకుని దినకరన్‌ కోట్లు గడించాడని దిండుగల్లు చేసిన విమర్శలతో వేదికపై ఉన్న నేతలు హడలిపోయారు. అమ్మ అభిమానుల్లో కంగారుపుట్టించాయి. అన్నాడీఎంకే మంత్రుల్లో అమ్మ గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎవ్వరూ చేయలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దిండుగల్లుకు కొత్తేమీ కాదు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా అప్పట్లో మేము చెప్పిన మాటలు అన్నీ అబద్దాలని గతంలో వ్యాఖ్యానించారు. 

అలాగే, డబ్బు లేకుండా ఎన్నికల్లో ఏమీ చేయలేమని మరోసారి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి డెంగీ నివారణ చర్యలపై చర్చలు జరిపారని ఒక సందర్భంలో దిండుగల్లు మాట్లాడటంతో ప్రధాని ఎవరో కూడా  ఈ మంత్రికి తెలియదని సామాజిక మాధ్యమాల్లో చలోక్తులు విసిరారు. దీంతో బహిరంగసభల్లో దిండుగల్లు ప్రసంగించకుండా పార్టీ దూరం పెట్టింది. అయితే కొంత విరామం తరువాత సోమవారం రాత్రి వేదికనెక్కిన దిండుగల్లు మరోసారి దివంగత జయలలితపై అక్రమార్జన మాటల బాంబును విసిరారు. వివాదాస్పదమైన మంత్రి దిండుగల్లు మాటలపై అన్నాడీఎంకే నేతలు లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా బహిరంగంగా ఎవ్వరూ ఖండించలేదు.  

Advertisement
Advertisement