స్వైన్ పంజా | Sakshi
Sakshi News home page

స్వైన్ పంజా

Published Sun, Feb 15 2015 2:33 AM

స్వైన్ పంజా

రాష్ట్రంలో నెలన్నర రోజుల్లో 186 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. వంద మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చెన్నైలో 9 మందికి ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక, శరీరంపై అకస్మాత్తుగా మంటలు లేచి వింత వ్యాధితో బాధపడుతున్న విల్లుపురానికి చెందిన మగ శిశువు కోలుకున్నాడు.
 
 సాక్షి, చెన్నై: రాష్ర్టంలో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్ని వెంటాడుతోంది. ఈ ఫ్లూను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చే స్తోంది. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు,గ్రామాల్లో ఆరోగ్య భద్రతా కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు జ్వరంతో ఇక్కడికి వస్తున్నారా? అని పరిశీలించేందుకు ప్రతి ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రత్యేక శిబిరాల్ని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలన్నరలో 186 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డట్టుగా ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. జిల్లాల వారీగా సేకరించిన సమాచారాల మేరకు ఈ వివరాలను ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగా కొన్ని స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. గత నెల 86 కేసులు నమోదు కాగా, ఈ నెలలో వంద కేసులు నమోదైనట్టు వివరించారు.
 
 గత నెల ఆస్పత్రుల్లో చేరిన వారు కోలుకున్నారని, వంద మందికి ఆయా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వివరించారు. గత నెల నమోదైన కేసుల్లో 11 మంది వారి ఇళ్ల వద్దే ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చెన్నై విషయానికి వస్తే ప్రస్తుతం 9 మంది ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరికి మెరుగైన వైద్య చికిత్సల్ని అందిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నెలన్నర కాలంగా 8 మంది ఈ ఫ్లూతో మరణించారని స్పష్టం చేశారు. ఎవరైనా జ్వరం బారిన పడితే, తక్షణం స్వైన్ ప్లూ సంబంధిత పరీక్షలు చేసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్ని సంప్రదిస్తే ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. స్వైన్ ఫ్లూ నివారణ లక్ష్యంగా అవగాహనా కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నామని వివరించారు.
 
 కోలుకున్న శిశువు : విల్లుపురం జిల్లా మైలం సమీపంలోని నొడి గ్రామానికి చెందిన కర్ణన్, రాజేశ్వరీ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు మగ పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. వీరి పెద్ద కుమారుడు రాహుల్ పుట్టగానే, వార్తల్లోకి ఎక్కాడు. ఆ శిశువు శరీరం నుంచి మంటలు రావడంతో ఆ వ్యాధి ఏమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. ఎట్టకేలకు వైద్య పరీక్ష అనంతరం రాహుల్ బాగానే ఉన్నాడు. అయితే, గత నెల 9న మూడో బిడ్డకు జన్మనిచ్చిన రాజేశ్వరి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ శిశువు శరీరంలోనూ మంటలు చెలరేగడంతో వైద్య శాస్త్రానికి మళ్లీ పరీక్ష ఎదురైంది. ఆ శిశువు కాళ్లు, తొడ భాగంలో మంటలు రావడం, ఆ భాగాలు కాలడంతో కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ బాలుడికి వైద్య చికిత్సల్ని అందించారు. మెరుగైన చికిత్సల్ని అందించడంతో పాటుగా ప్రతిరోజు  24 గంటలు తమ పర్యవేక్షణలో ఉంచి ఆ శిశువుకు వైద్య బృందం సఫర్యలు చేసింది. వైద్య చికిత్సల మెరుగుతో, మళ్లీ మంటలు రాని దృష్ట్యా,  ఆ శిశువు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆ శిశువును శనివారం కీల్పాకం ఆస్పత్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్ పరిశీలించారు. ఆ శిశువు ఆరోగ్యం మెరుగు పడడంతో వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. అయితే, ఆ శిశువును డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారోనన్నది తేలాల్సి ఉంది.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement