రెండో విడత కౌన్సెలింగ్‌కు శ్రీకారం | Sakshi
Sakshi News home page

రెండో విడత కౌన్సెలింగ్‌కు శ్రీకారం

Published Mon, Aug 5 2013 11:37 PM

Tamilnadu Medical Counselling Phase II

రాష్ట్రంలో ఈ ఏడాది ఎంబీబీఎస్, దంత వైద్యకోర్సుల సీట్ల సంఖ్య పెరిగింది. వీటి భర్తీ నిమిత్తం మలి విడత కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. వైద్య సీట్ల పెంపుపై అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఆరోగ్యశాఖ నేతృత్వంలో 18 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1823 ఎంబీబీఎస్ సీట్లు, 11 స్వయం ప్రతిపత్తి హోదా (ప్రరుువేటు) కళాశాలల్లో 838 సీట్లు ఉన్నాయి. చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 70 సీట్లు, 18 ప్రయివేటు దంత వైద్య కళాశాలల్లో 909 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి 28,788 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ సీట్లను గత నెల భర్తీ చేశారు. సీట్లు దక్కని వాళ్లు నిరుత్సాహపడే సమయంలో భారత మెడికల్ కౌన్సిల్ శుభవార్త పంపింది. దీంతో అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరిసింది.
 
 సీట్ల పెంపు
 ఈ విద్యా సంవత్సరానికి అదనపు సీట్లను రాష్ట్రానికి కేటాయిస్తూ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సీట్లు ఏఏ కళాశాలలకు అనేది తేలడంలో జాప్యం నెలకొంది. ఫలితంగా కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇది వరకు ప్రకటించిన ర్యాండం నెంబర్లు, ర్యాంకుల ఆధారంగా ఈ సీట్ల భర్తీకి నిర్ణయించారు. ఈ క్రమంలో సీట్ల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాల్ని మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ మేరకు చెన్నై ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 85, స్టాన్లీ వైద్య కళాశాలకు 100, సేలం వైద్య కళాశాలకు 25, తిరుచ్చికి 50, తూత్తుకుడికి 50, తిరువణ్ణామలైకు 100 సీట్లు కేటారుుంచారు. కేంద్రానికి పోను రాష్ర్ట ప్రభుత్వ కోటా కింద 349 సీట్లు దక్కాయి. ఇది వరకు ఖాళీగా ఉన్న ఏడు సహా మొత్తం 356 ప్రభుత్వ కోటా సీట్ల భర్తీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 
 అలాగే కేకేనగర్ ఈఎస్‌ఐసీ తదితర పది ప్రయివేటు కళాశాలలకు అదనంగా కేటాయించిన 714 సీట్ల భర్తీకి నిర్ణయించారు. ఇక చెన్నై ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు అదనంగా 100 సీట్లు వచ్చాయి. ఇందులో 15 కేంద్ర ప్రభుత్వ కోటా, 85 రాష్ర్ట ప్రభుత్వ కోటా కిందకు వస్తాయి. అలాగే పదిహేను ప్రయివేటు దంత వైద్య కళాశాలలకు 937 సీట్లను కేటాయించారు. వీటన్నింటినీ రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయూలని అధికారులు నిర్ణయించారు. కీల్పాకం వైద్య కళాశాల వద్ద సోమవారం ఉదయం 9 గంటలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలి రోజు రెండు వందల మంది అభ్యర్థులను ఆహ్వానించారు. సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు తమ ఆప్తులతో ఆనందాన్ని పంచుకున్నారు.
 

Advertisement
Advertisement