Sakshi News home page

టాటూ ఫీవర్

Published Wed, Feb 18 2015 2:58 AM

టాటూ ఫీవర్

 శరీరాన్ని కాన్వాస్‌గా చేసి, మనసులోని భావాలను రంగుల్లో కలిపి, మనసైన రూపాన్నో... సందేశాన్నో దేహంపై ముద్రించే విధానమే ‘టాటూ డిజైనింగ్’. మనసైన పేరును, నమ్మిన సిద్ధాంతాలను, నచ్చిన ప్రాంతాల చిత్రాలను టాటూలుగా వేయించుకొంటున్నారు. నగరాల్లోని ఫ్యాషన్‌లన్నింటిలోకి టాటూకే ఎక్కువ డిమాండ్ ఉంది.          
 
 ఎన్నో రంగులు... మరెన్నో ఆకృతులు
 మనసుకు నచ్చిన అంశాన్ని టాటూగా దేహంపై ముద్రించుకోవడానికి ప్రస్తుతం ఎన్నో రకాల కలర్స్ అందుబాటులో ఉన్నాయి. రంగులతో పాటు ఎన్నో రకాల ఆకృతులు టాటూ డిజైనింగ్‌లో సందడి చేస్తున్నాయి. సాధారణంగా ఏ విధమైన టాటూ వేయించుకోవాలనే విషయంపై మనకు అవగాహన లేకపోతే టాటూ డిజైనర్ సూచించే వాటిని దేహంపై ముద్రించుకోవచ్చు. దాదాపు 40కి పైగా టాటూ కలర్స్ మార్కెట్‌లో ఉన్నప్పటికీ చాలా మంది యువతీ యువకులు నలుపు రంగునే టాటూ కోసం ఎంచుకుంటున్నారు. శరీరంపై కొట్టొచ్చినట్లు కనిపించడంతో పాటు లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా సులభంగా తొలగించేందుకు నలుపు రంగు టాటూలకు అవకాశం ఉండడంతో చాలా మంది యువత టాటూ వేయించుకునేటపుడు నలుపు రంగునే కోరుకుంటున్నారు. ఇక టాటూల సైజ్ రెండు చదరపు అంగుళాల నుంచి ప్రారంభమౌతుంది. వెచ్చించగల మొత్తాన్ని బట్టి టాటూ సైజ్‌ను నిర్ణయిస్తూ ఉంటారు.
 
 సందేశాలు, స్నేహాలకే ప్రాధాన్యం
 ఎక్కువ మంది తమ మనసుకు నచ్చిన, తాము మెచ్చిన సందేశాలను టాటూలుగా ముద్రించుకోవడానికి ఇష్టపడుతున్నారు. సందేశాలతో పాటు తమ స్నేహితులను నిత్యం గుర్తుచేసుకునేందుకు వారి పేర్లు, స్నేహానికి సంబంధించిన సందేశాలను టాటూలుగా వేసుకునేందుకు సై అంటున్నారు. సందేశాలు, స్నేహాల తర్వాత ప్రేమికులు, తమ కుటుంబసభ్యుల పేర్లను, తమ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను  టాటూలుగా వేయించుకోవడానికి నగర యువత ఇష్టపడుతోంది. ఇక మధ్యవయస్కుల్లోనూ ప్రస్తుతం ఈ టాటూల ట్రెండ్ కనిపిస్తోంది. మధ్యవయస్కులతో పాటు కొంత మంది యువతీ యువకులు కూడా తమ మనసుకు నచ్చిన దేవుళ్ల రూపాలను టాటూలుగా ముద్రించుకుంటున్నారు. ఒక్కొ టాటూ వేయించుకోవడానికి సైజ్, డిజైన్‌ను బట్టి దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఖర్చవుతుంది. ఇక దేహంపై ముద్ర పడిపోయిన టాటూలను చెరిపేసేందుకు కూడా ప్రస్తుతం అత్యాధునిక లేజర్ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది.
 
 పచ్చబొట్టు కాదు
 చాలా మంది టాటూ అన్నా పచ్చబొట్టు అన్నా ఒకటేనని భావిస్తూ ఉంటారు. కానీ ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎన్నో వందల ఏళ్ల కాలం నుంచి వినిపిస్తున్న పచ్చబొట్టులో శాస్త్రీయత శూన్యం. పచ్చబొట్టు వేయడం కోసం వాడే ఆకుపసర్లకు కూడా ఎలాంటి చట్టబద్దత లేదు. పచ్చబొట్టు వేసేందుకు వాడే సూదులను స్టెరిలైజ్ చేయకుండా ఎక్కువ మందికి వాడడం వల్ల అనేక రకాల వ్యాధులు విస్తరించేందుకు ప్రమాదం ఉంది. అంతేకాక పచ్చబొట్టు వేసిన సమయంలో చర్మం బొబ్బలెక్కినట్టుగా కనిపించి, మిగతా ప్రాంతం కంటే భిన్నంగా కనిపిస్తుంది. అయితే టాటూ వేస్తే మాత్రం చర్మంలోనే కలిసిపోతుంది. పచ్చబొట్టుతో పోలిస్తే టాటూ శరీరంలోకి తక్కువ భాగం చొచ్చుకుపోతుంది. నైపుణ్యం కలిగిన టాటూ డిజైనర్‌లు అన్ని రకాల అనుమతులు, శిక్షణ పొందిన తర్వాతనే టాటూ వేయడం ప్రారంభిస్తారు కాబట్టి చర్మానికి సమస్య తలెత్తే అవకాశం తక్కువగా ఉంటుంది.
 
 చర్మసమస్యలు ఉంటే టాటూలకు దూరం
 యువత ఎంతో క్రేజీగా భావిస్తున్న టాటూ వేయించుకునేటపుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరని బెంగళూరుకి చెందిన టాటూ డిజైనర్ రమేష్ వెల్లడించారు. ‘టాటూ వేయించుకునే ముందు డిజైనర్‌కు శిక్షణా పరమైన అన్ని రకాల ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలి. అంతేకాక మన చర్మతత్వానికి టాటూ సరిపడుతుందా లేదా అనే విషయంపై డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవాలి. ఏదైనా చర్మసమస్యలున్న వారు టాటూలకు దూరంగా ఉండడమే మంచిది. టాటూ వేయించుకున్న తర్వాత 100 రోజులు తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అమ్మాయిలకైతే 18ఏళ్లు, అబ్బాయిలకైతే 21ఏళ్లు దాటిన తర్వాతే టాటూలు వేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. చిన్నప్పుడే టాటూలు వేయించుకుంటే చర్మ సంబంధ సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement