గుట్కాయ స్వాçహాపై చర్యలేవీ? | Sakshi
Sakshi News home page

గుట్కాయ స్వాçహాపై చర్యలేవీ?

Published Fri, Jun 30 2017 3:44 AM

గుట్కాయ స్వాçహాపై చర్యలేవీ? - Sakshi

నిందితుల రాజీనామాకు విపక్షాల పట్టు
సీబీఐ విచారణకు డీఎంకే డిమాండ్‌
అసెంబ్లీ సమావేశాలు రసాభాస

సాక్షి ప్రతినిధి, చెన్నై:
గుట్కా విక్రయాల కోసం అడ్డదారిలో కోట్లాది రూపాయలు గుటుక్కున మింగేసిన అంశంపై గురువారం నాటి అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. నిందితులకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని ప్రతిపక్షాల కేకలు, వాకౌట్, అధికారపక్షం ఎదురుదాడితో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గుట్కా అమ్మకాలకు లంచం వ్యవహారం గురువారం కూడా అసెంబ్లీని కుదిపేసింది. సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్పీకర్‌నుద్దేశించి ప్రతిపక్ష నేత స్టాలిన్‌ మాట్లాడుతూ, ఒక ప్రధాన అంశంపై మాట్లాడేందుకు బుధవారం నాటి సమావేశాల్లో కోరగా ఆ అంశంపై విచారణలో ఉందని తోసిపుచ్చారని, అయితే ఈనాటి సమావేశాల సందర్భంగా సదరు అంశంపై ఆధారాలను సమర్పించినందున మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

విపక్షాలు కోరుతున్న అంశంపై సీఎం మాట్లాడతారని స్పీకర్‌ చెప్పగానే ఎడపాడి లేచి నిలు చుని ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతిపక్షాల ప్రశ్నలు వినకుండానే సమాధానం ఎలా చెబుతారని ఆక్షేపిస్తూ డీఎంకే సభ్యులంతా అభ్యంతరం వ్యక్తంచేశారు. బుధవారం సమావేశాల్లో డీఎంకే సభ్యుల కోర్కె మేరకే సీఎం ప్రసంగిస్తున్నారని స్పీకర్‌ ఇచ్చిన వివరణను డీఎంకే సభ్యులు అంగీకరించకుండా తమ నేత మాట్లేందుకు అవకాశం ఇవ్వాలని కేకలు వేయడంతో స్పీకర్‌ అనుమతించారు. తరువాత స్టాలిన్‌ మాట్లాడుతూ, గుట్కా, పాన్‌మసాలా తదితర మత్తు పదార్థాల అమ్మకాలను 2013 మే 9వ తేదీన ప్రభుత్వం నిషేధించిందని గుర్తుచేశారు. కానీ, రాష్ట్రంలో మత్తుపదారాల అమ్మకాలు సాగుతూ రూ.250 కోట్లు పన్ను ఎగవేస్తున్నట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు దాడులు చేశారని ఆయన చెప్పారు.

ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డైరీల ఆధారంగా ఒక మంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు, వారికి రూ.40 కోట్ల ముడుపులు ముట్టినట్లు తేలిందని చెబుతుండగా స్పీకర్‌ అడ్డుతగిలి మీడియాలో వస్తున్న కథనాలను అసెంబ్లీలో మాట్లాడరాదని అన్నారు. అంతేగాక స్టాలిన్‌ మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు. ఐటీ అధికారుల ఉత్తరం ఆధారంగా మంత్రి, పోలీసు ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించాని డిమాండ్‌చేయగా, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత రామస్వామి సైతం మద్దతు పలికారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన జారీచేసిన ఆదేశాల మేరకు అవినీతి నిరోధక పోలీసు శాఖ విచారణ జరుపుతున్నట్లు సీఎం తెలిపారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విన్సెంట్‌ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశాడని ఆయన చెప్పారు.

పోలీసు శాఖే ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేయవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించి పిటీషన్‌ను కొట్టివేసినట్లు సీఎం తెలిపారు. గుట్కా అవినీతి అంశాన్ని సీఎం దాటవేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే సభ్యులు లేచి నిలబడి కేకలు వేశారు. సీఎం సమాధానం ఇచ్చినందున, విచారణ కొనసాగుతున్నందున డీఎంకే సభ్యులు కూర్చోవాలని స్పీకర్‌ కోరారు. మంత్రి చేత రాజీనామా చేయించాలనీ.. సీబీఐ విచారణకు ఆదేశించాలన్న అంశంపై సీఎం సమాధానం తమకు సంతృప్తి ఇవ్వనందున వాకౌట్‌ చేస్తున్నామని స్టాలిన్‌ ప్రకటించి సభ్యులతో సహా బయటకు వెళ్లిపోయారు.

రాజీనామా.. ఆపై సీబీఐ విచారణ : స్టాలిన్‌
వాకౌట్‌ చేసిన అనంతరం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ, గుట్కా బాగోతంపై రాష్ట్రంలోని అన్ని మీడియాలు కోడై కూస్తుండగా ఆధారాలు ఉంటేనే మాట్లాడండి అంటూ అసెంబ్లీలో ప్రస్తావించేందుకు స్పీకర్‌ అనుమతించలేదని అన్నారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశంలో ఆధారాలను సమర్పించినా కేవలం కొద్దిసేపు మాత్రమే అనుమతించారని అన్నారు. పైగా తాను అడిగిన ప్రశ్నలను సీఎం దాటవేసి వేరేదో అంశాన్ని మాట్లాడారని విమర్శించారు. విచారణకు అనుమతించాలని ఐటీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  ఉత్తరం కోరినా పట్టించుకోలేదని అన్నారు.

అలాగే నిందితుల్లో ఒకరైన అప్పటి నగర కమిషనర్‌ జార్జే విచారణ చేపట్టాలని డీజీపీకి ఉత్తరం రాయడం విచిత్రమని వ్యాఖ్యానించారు. గుట్కా ముడుపుల వ్యవహారంలో మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు ఒక నాటకాన్ని నడిపించారని దుయ్యబట్టారు. గుట్కా అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తాము కోరుతున్నామని తెలిపారు. అయితే విచారణ నిజాయితీగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, ఇతర పోలీసు అధికారుల చేత రాజీనామా చేయించి సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం ఎడపాడిని అసెంబ్లీలో డిమాండ్‌ చేసినట్లు స్టాలిన్‌ తెలిపారు. దానిపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వాకౌట్‌ చేశామని వివరించారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్టాలిన్‌ స్పష్టంచేశారు.

పోలీసుశాఖలో భయం.. భయం
గుట్కా వ్యవహరం రాష్ట్రమంతా సంచలనం కావడం.. నివేదిక పంపాల్సిందిగా కేంద్రం కోరడంతో పోలీసు అధికారుల్లో భయం నెలకొంది. 2014–16 మధ్యకాలంలో గుట్కా అమ్మకాలకు అండగా నిలిచి రూ.40 కోట్ల లంచం పుచ్చుకున్న అవినీతి భాగోతం ఇటీవలి వరకు తమిళనాడు ఎల్లలు దాటి వెళ్లలేదు. అయితే ఐటీ అధికారులు నాలుగురోజుల కిందట బట్టబయలు చేయడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. అమ్మ మరణించిన నాటి నుంచి రాష్ట్రంపై తెరవెనుక నుంచి పెత్తనం సాగిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు కేంద్రం గుట్కా వ్యవహారాన్ని ఒక మంచి అవకాశంగా అందిపుచ్చుకుంది. గుట్కా అవినీతిలో భాగస్వామ్యులైన వారిలో కొందరు ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌ సర్వీసులు కేంద్రం గుప్పిట్లో ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఎలా ఉంటుందో, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని ఐపీఎస్‌ అధికారులు హడలిపోతున్నారు.

Advertisement
Advertisement