కర్ణాటక బెస్ట్ | Sakshi
Sakshi News home page

కర్ణాటక బెస్ట్

Published Sat, Jan 24 2015 2:41 AM

కర్ణాటక బెస్ట్ - Sakshi

పెట్టుబడిదారులకు ఆహ్వానం
పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా నూతన పారిశ్రామిక పాలసీ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

 
బెంగళూరు : పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రాష్ట్రాలకంటే కర్ణాటక అత్యుత్తమమైన ప్రాంతమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(కేఎస్‌ఐఐడీసీ) సువర్ణ మహోత్సవ సంబరాలను శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తుమకూరులోని 14వేల ఎకరాల్లో ఉత్పాదనా రంగ పెట్టుబడుల హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లకు గాను కొత్త ఇండస్ట్రియల్ పాలసీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.  రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా ఈ పాలసీని రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావలసిన అన్ని విధాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి రుణాలను కేఎస్‌ఐఐడీసీ సంస్థ అందజేసి సహకరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 2,300 పరిశ్రమలకు కేఎస్‌ఐఐడీసీ సహకారం అందజేసిందని  గుర్తు చేశారు. ఇక ఐటీ రంగంలోని ప్రతిష్టాత్మక సంస్థ ఇన్ఫోసిస్ సైతం తొలినాళ్లలో కేఎస్‌ఐఐడీసీ సహాయ, సహకారాలు తీసుకుందని, ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇక ఈ సందర్భంగా కేఎస్‌ఐఐడీసీ సావనీర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement