ఖరీష్ కళకళ | Sakshi
Sakshi News home page

ఖరీష్ కళకళ

Published Tue, Sep 17 2013 3:11 AM

The main reservoirs were filled

సాక్షి, బెంగళూరు : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం దాదాపుగా నెరవేరనుంది. ధాన్యాలు, నూనె విత్తులు, వాణిజ్య పంటలు...అంతా కలిసి 74.29 లక్షల హెక్టార్లలో వేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 68.78 లక్షల హెక్టార్లలో విత్తన కార్యక్రమం పూర్తయింది. గత ఏడాది ఇదే కాలంలో 59 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు పెట్టారు. ఈ నెల ప్రథమార్ధం వరకు సాధారణ వర్షపాతం 731 మి.మీ. కాగా 844 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ సెప్టెంబరులోనే నిండిపోయాయి. కరెంటు కష్టాలు తీరాయి.

తమిళనాడుతో జల జగడానికి తాత్కాలికంగా తెర పడింది. బెంగళూరు నగర వాసుల నీటి ఆదరవు ‘కేఆర్‌ఎస్’ ఎప్పుడో నిండిపోయింది. పంట విస్తీర్ణ లక్ష్యం రాష్ట్రమంతటా 93 శాతంగా నమోదైంది. కరువు జిల్లాలుగా పేరొందిన కోలారు, తుమకూరు, చామరాజ నగర జిల్లాల్లో 85 శాతం విస్తీర్ణంలో మాత్రమే విత్తన కార్యక్రమం పూర్తయింది. వెనుకబడిన ప్రాంతమైన గుల్బర్గలో పంట విస్తీర్ణం 105 శాతంగా నమోదు కాగా, చక్కెర నాడుగా పేరొందిన మండ్యలో 67 శాతంలో మాత్రమే పంటలు పెట్టారు. దావణగెరె, బిజాపుర, రాయచూరు, ధార్వాడ జిల్లాల్లో వంద శాతం లక్ష్యం పూర్తయింది. సెప్టెంబరు ఆఖరు వరకు గడువు ఉండడంతో రాష్ట్రమంతా వంద శాతం లక్ష్యం చేరుకోవడం ఏమంత కష్టం కాదు.

 అన్ని పంటలూ...

 వరి, జొన్న, రాగి, మొక్క జొన్న, చిరు ధాన్యాలు... 33.97 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. ఈ పంటలను 35.06 లక్షల హెక్టార్లలో సాగు చేయాలన్నది లక్ష్యం. 15.87 లక్షల హెక్టార్లలో పప్పులను సాగు చేయాలనుకోగా ఇప్పటి వరకు 13.7 లక్షల హెక్టార్లలో పంటను పెట్టారు. నూనె గింజలను 12.82 హెక్టార్లలో సాగు చేయాలనుకోగా, ఇప్పటి వరకు 10.66 లక్షల హెక్టార్లలో విత్తన కార్యక్రమం పూర్తయింది. వేరుశెనగ 6.77 లక్షల హెక్టార్లకు గాను 4.91 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. పత్తిని 10.55 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని నిర్దేశించుకోగా, 10.95 లక్షల హెక్టార్లలో సాగులోకి వస్తోంది.
 

Advertisement
Advertisement