పోలీసు ‘పోరు’ | Sakshi
Sakshi News home page

పోలీసు ‘పోరు’

Published Tue, Jul 4 2017 3:44 AM

పోలీసు ‘పోరు’ - Sakshi

శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులే పోరుబాట సాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఉత్కంఠే. తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా పోలీసులు పోరుబాటకు సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఓవైపు పోస్టర్లు, మరోవైపు వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల పోలీసు సహచరులకు పిలుపునిస్తూ సాగుతున్న ప్రచారాలు పోలీసుశాఖ ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎక్కడినుంచి ఈ పిలుపు వస్తోందో.. ఏదేని ఆందోళనలు బయలుదేరినా పసిగట్టి  ఉక్కుపాదంతో అణచివేసే రీతిలో  ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించారు. అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ రాజేంద్రన్‌ అలెర్ట్‌ ఉత్తర్వుల్ని జారీచేసి ఉన్నారు.
6న సచివాలయం ముట్టడికి పిలుపు
సామాజిక మాధ్యమాల్లో ప్రచార హోరు
ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ
రంగంలోకి ఇంటెలిజెన్స్‌
సచివాలయం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం

సాక్షి, చెన్నై :  మేల్కొందాం..! అంటూ పోలీసులకు పిలుపునిస్తూ వెలసిన పోస్ట ర్లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. దేశంలోనే తమిళనాడు పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్ర కీలకం. రాష్ట్రంలో దక్షిణం, ఉత్తరం, పశ్చిమం, సెంట్రల్‌ జోన్లుగా  రేయిం బవళ్లు పోలీసులు తమ విధుల్ని నిర్వర్తిస్తూ వస్తున్నారు. అనేకచోట్ల సిబ్బంది కొరతతో పని ఒత్తిడి అధికం. సెలవులు అంతంత మాత్రమే. కుటుంబాలకు దూరంగా గడపాల్సిన పరిస్థితుల్లో ఎందరో పోలీసులు ఉన్నారని చెప్పవచ్చు.

 ఈ నేపథ్యంలో గత నెలాఖరులో చెన్నై సెయింట్‌ థామస్‌ మౌంట్‌ పరిసరాల్లో ప్రత్యక్షమైన పోస్టర్లు పోలీసు వర్గాల్లో చర్చకు దారితీశాయి. మిత్రులారా..! మేల్కొందాం..! అన్ననినాదంతో పోలీసులకు పిలుపునిస్తూ వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విధులు, జీతభత్యాలను వివరిస్తూ, పోలీసులపై ఎందుకు వివక్ష అన్నట్టుగా పేర్కొన్న నినాదాలతో ఆ పోస్టర్ల ఉద్దేశం ఏమిటోనన్న ప్రశ్న బయలుదేరింది. మరో రెండు రోజుల వ్యవధిలో సచివాలయానికి కూత వేటు దూరంలో, తిరుచ్చితో పాటు మరికొన్ని చోట్ల పోస్టర్లు ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

పోరుబాటకు సిద్ధమవుతున్నారా?
ఈనెల ఆరో తేదీన అసెంబ్లీలో హోం శాఖకు నిధుల కేటాయింపులపై చర్చ సాగనుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా పోరుబాటకు సిద్ధం అవుతున్నారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు అద్దంపట్టే రీతిలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోలీసు పోరు నినాదం మిన్నంటడం , వాట్సాప్‌లలో డిమాండ్లను వివరిస్తూ ఆరున అసెంబ్లీ, సచివాలయం ముట్టడికి సిద్ధం అవుదామన్న పిలుపుతో సందేశాలు రావడం పోలీసు బాసుల్లో ఉత్కంఠను రేపింది. ఏడాదికి 200 పని దినాలు, ఎనిమిది గంటల విధులు, ఏడో వేతన కమిషన్‌ అమలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల రాయితీల డిమాండ్లతో పాటుగా, సహచరులకు పిలుపునిస్తూ  ఆడియో పిలుపుతో సందేశం వాట్సాప్‌లలో హల్‌చల్‌ చేస్తుండటాన్ని బాసులు తీవ్రంగా పరిగణించారు.

పోస్టర్లు ఎవరు ఏర్పాటుచేశారు.. ఎక్కడ ముద్రించారు.. దీని వెనుక ఉన్నదెవరు? అన్న విషయాల్ని రాబట్టేందుకు ఇప్పటికే తలలు పట్టుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు, తాజాగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పిలుపుతో అప్రమత్తం అయ్యారు. అన్ని జిల్లాల ఎస్పీలకు అలెర్ట్‌గా ఉండాలన్న ఉత్తర్వులు డీజీపీ కార్యాలయం నుంచి పంపించి ఉన్నారు. డీజీపీ రాజేంద్రన్‌ ఆదేశాలతో ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. తెర వెనుక నుంచి సాగిస్తున్న ప్రయత్నాలను నిగ్గు తేల్చే విధంగా నిఘాతో వ్యవహరిస్తున్నారు. వాట్సాప్‌ సందేశం అయితే, ప్రతి పోలీసును ఆకర్షించే రీతిలో కుటుంబ పరిస్థితులు, సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి ఉండటంతో, ఆ గళం ఎవరిదోనని ఆరా తీస్తున్నారు. హఠాత్తుగా సచివాలయం ముట్టడికి ప్రయత్నాలు సాగినా, అడ్డుకునేందుకు తగ్గట్టుగా, ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టడం చేయడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement