చల్లారని అసమ్మతి | Sakshi
Sakshi News home page

చల్లారని అసమ్మతి

Published Tue, Jun 21 2016 2:02 AM

చల్లారని అసమ్మతి - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
మండ్యలో అంబి అభిమానురాలి ఆత్మహత్యాయత్నం
రాజీనామా ఉపసంహరించుకోవాలని అంబిని కోరిన సీఎం ?
అంబికి దేవెగౌడ ఫోన్‌కాల్

 

బెంగళూరు:  రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ జరిగి 24 గంటలు గడిచినా అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి చల్లారడం లేదు. రెబెల్‌స్టార్‌గా పేరున్న శాండల్‌వుడ్‌నటుడు తాజా మాజీ గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్ ఏకంగా తన శాసనసభ సభ్యత్వాన్ని త్యజించడానికి సిద్దపడగా ఆయన బాటలో మరికొంతమంది నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పదవులు కోల్పోయిన మరికొంతమంది సిద్ధరామయ్యపై ధిక్కారస్వరం వినిపిస్తుండగా ఆయన అనుచరుల రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అంబరీష్‌తో పాటు మొత్తం 14 మంది తమ మంత్రి పదవులు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రెబెల్‌స్టార్’ తిరుగుబావుట ఎగురవేశారు. మంత్రిపదవిని తొలగించినందుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ శివకుమార్‌రెడ్డికి ‘మండ్య శాసనసభ్య స్థానానికి రాజీనామా చేస్తున్నాను.’ అన్న ఒక్క వ్యాఖ్యతో పాటు అంబరీష్ సంతకం కలిగిన లేఖను డిప్యూటీ స్పీకర్ శివశంకర్‌రెడ్డికి ఆయన ఆప్తుడిగా పేరొందిన శ్రీనివాస్ అందజేశారు.


అయితే  నిబంధనలకు అనుగుణంగా రాజీనామాపత్రం లేదని పేర్కొంటూ అంబరీష్ రాజీనామాను శివశంకర్‌రెడ్డి తిరస్కరించారు. అంబి స్వయంగా వచ్చి రాజీనామా చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా అంబరీష్‌కు నేరుగా ఫోన్‌చేసి రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని సిద్దుకు తేల్చినట్లు సమాచారం. అంతేకాకుండా అంబరీష్ తన అనుచరులతో సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. ఈ విషయాలన్నింటపై నేడు (మంగళవారం) మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.  ఇదిలా ఉండగా ‘ముక్కుసూటిగా వ్యవహరించేవారు, నిజాయితీ కలిగిన వారు ప్రస్తుత రాజకీయాల్లో రాణించలేరు.’ అని అంబరీష్ భార్య సుమలత ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

 
అంబరీష్‌తో పలువురి భేటీ

మరోవైపు అంబరీష్ రాజీనామా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జేడీఎస్ పార్టీకి చెందిన వారు ఆయన్ను బెంగళూరులో కలుసుకున్నారు. ముఖ్యంగా మంత్రి పదవి దక్కనందుకు సిద్ధుతో పాటు పార్టీ హైకమాండ్‌పై గుర్రుగా ఉన్న యశ్వంతపుర ఎమ్మెల్యే సోమశేఖర్ ‘రెబెల్’తో ప్రత్యేకంగా అరగంటసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజీనామాపై తొందర పడొద్దని సూచించినట్లు చెప్పారు. మరోవైపు జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ అంబికి సోమవారం సాయంత్రం ఫోన్‌చేసి మాట్లాడారు. మీకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని త్వరపడి నిర్ణయం తీసుకోకండని పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా దేవేగౌడ అనుమతితో ఆ పార్టీ ఎమ్మెల్సీ శరవణ నేతృత్వంలో కొంతమంది నాయకులు అంబరీష్‌ను ఆయన నివాసంలో కలిసి గంటకు పైగా చర్చించారు. అనంతరం శరవణ మీడియాతో మాట్లాడుతూ...‘రూ.100 కోట్లు ఇచ్చినా రాజీనామాను వెనక్కు తీసుకోనని అంబరీష్ స్పష్టం చేశారు. జేడీఎస్ పార్టీలోకి ఆహ్వానించాము. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు.’ అని పేర్కొన్నారు.

 

అభిమానుల నిరసనలు
మండ్య: మంత్రి వర్గం నుంచి అంబరీశ్‌ను తప్పించడంతో సోమవారం ఆయన తన ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా చేయడంతో ఆయన మహిళా అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. సోమవారం నగరంలోని జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్‌లో ఓ మహిళా అభిమాని కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. తాలూకాలోని బేవినహళ్లికి చెందిన కనకమ్మ అంబి వీరాభిమాని. ఉదయం అంబి మహిళా అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. వీరిలో అంబి వీరాభిమాని అయిన కనకమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని సపర్యలు చేపట్టారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement