Sakshi News home page

ఐ యామ్ సారీ

Published Thu, Apr 2 2015 2:40 AM

ఐ యామ్ సారీ - Sakshi

 సాక్షి, చెన్నై: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డి సబిత మద్రాసు హైకోర్టుకు క్షమాపణలు చెప్పుకున్నారు. అంధుల విషయంలో జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంధులూ మనుషులేనని, నిబంధనలు ఉల్లంఘించడం ఉన్నత స్థాయిలోని అధికారులకు పరిపాటిగా మారిందని ప్రధాన బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. 2009లో పాఠశాల విద్యా శాఖ 195 పోస్టుల భర్తీ నిమిత్తం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు  అంధులు అర్హులు కారని స్పష్టం చేస్తూ ప్రత్యేకంగా ఆ నోటిఫికేషన్‌లో పొందు పరిచిన అంశాలు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లో అంధులకు మూడు శాతం కేటాయించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా నోటిఫికేషన్ వెలువడడంతో అంధుల సంఘం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ లో భాగంగా గత వారం విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి సబిత తరపున ఇచ్చిన వివరణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.
 
 ఆగ్రహం : అంధుల పిటిషన్‌కు వివరణ ఇస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌లో విద్యాశాఖ అధికారులు  చేసిన తప్పులు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి సబితకు చుట్టుకుంది. ఆ పోస్టుల భర్తీ గురించి వివరిస్తూ, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.  అయితే, విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో బోధించాల్సిన ఆ పోస్టులకు అవసరమయ్యే వారు ఎలాంటి అవయవలోపం లేని వాళ్లుగా ఉండాలని పేర్కొన్నారు. . అయితే,  అంధులు, చెవిటి వాళ్లను నియమిస్తే, ఇబ్బందులు ఎదురు అవుతాయని, అందుకే తమ నోటిఫికేషన్‌లో అలాంటి వారు అనర్హులుగా స్పష్టం చేశామని ఇచ్చిన వివరణ హైకోర్టుకు ఆగ్రహం తెప్పించింది. ఇదేనా అంధుల విషయంలో వ్యవహరించే విధానం, ఇదేనా రిట్ పిటిషన్ ద్వారా ఇచ్చే వివరణ అని తీవ్ర ఆక్షేపణను వ్యక్తం చేశారు. ఈ సమస్యను తాము వదలి పెట్టే ప్రసక్తే లేదని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి కోర్టుకు రావాలని ఆదేశించారు.
 
 సారీ : బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సబిత కోర్టుకు హాజరు కావడంతో పాటుగా క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. నిబంధనల మేరకు క్షమాపణ చెబుతూ పిటిషన్ సైతం దాఖలు చేశారు. దీనిని అడ్వకేట్ జనరల్ సోమయాజులు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు అందజేశారు. రిట్ పిటిషన్‌లో జరిగిన పొరబాటు, తప్పును సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కొన్ని వ్యాఖ్యల్ని చేసింది. అంధులూ మనుషులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన పదవులు ఎన్ని, ఖాళీలు ఎన్ని తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉందన్నారు. తప్పులను చేయడం పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్లు తప్పులు చేయొచ్చా..? అని ప్రశ్నించారు. ఉన్నత పదవిలో ఉన్న వాళ్లే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తారని అసహనం వ్యక్తం చేస్తూ, పిటిషన్ విచారణను ముగించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement