పునరాగమనం | Sakshi
Sakshi News home page

పునరాగమనం

Published Thu, Jan 9 2014 4:38 AM

Today yaddiki political uprising

= నేడు యడ్డికి బీజేపీ తీర్థం
 = మరో నలుగురు ఎమ్మెల్యేల సహా
 = పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా అప్పను నియమించే అవకాశం
 = ఎంపీలు రాఘవేంద్ర, శివకుమార్లపై సస్పెన్షన్ ఎత్తివేత

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం లాంఛనంగా బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఎమ్మెల్యేలు గురుపాదప్ప నాగమారపల్లి, విశ్వనాథ పాటిల్, యూబీ. బణకార్‌లతో పాటు మాజీ మంత్రులు సీఎం. ఉదాసీ, శోభా కరంద్లాజె, కేంద్ర మాజీ మంత్రి ధనంజయ కుమార్ సహా పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి సహా పలువురు సీనియర్ నాయకులు  గత వారంలో యడ్యూరప్పను లాంఛనంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా కేజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని పేర్కొంటూ శివమొగ్గ ఎంపీ, యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర, సీఎం. ఉదాసీ తనయుడు, హావేరి ఎంపీ శివ కుమార్‌లను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కేజేపీ విలీనం నేపథ్యంలో ఆ సస్పెన్షన్ రద్దు చేయాలని రాష్ట్ర శాఖ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. బీజేపీలో చేరిన తర్వాత యడ్యూరప్పను పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడితో పాటు జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించనున్నారు. ఈ నెల 18 నుంచి ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఆ సందర్భంగా యడ్యూరప్ప పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సహా అగ్ర నేతలను కలుసుకోనున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement