రేపే ఢిల్లీ ఫలితాలు | Sakshi
Sakshi News home page

రేపే ఢిల్లీ ఫలితాలు

Published Sat, Dec 7 2013 2:43 AM

tommorrow only delhi result

 ఓట్ల లెక్కింపునకు 14 కేంద్రాలు సిద్ధం
 
 సాక్షి, న్యూఢిల్లీ:
 హోరాహోరి ప్రచారం, రికార్డుస్థాయి పోలిం గ్ తదితర ప్రక్రియల తర్వాత అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈ లెక్కింపు తర్వాతే గెలిచిందెవరో? ఓడిందెవరో? తేలిపోనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 8వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న 70 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం నగరంలోని 9 జిల్లాల్లో 14 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పదకొండు వేలకుపైగా పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చిన ఈవీఎంలను ఈ 14 కేంద్రాలకు తరలించి, ఓట్ల లెక్కింపును చేపడతారు.
 
 తూర్పు ఢిల్లీ, మధ్య ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ జిల్లాలో రెండేసి చొప్పున... దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, న్యూఢిల్లీ, నైరుతి ఢిల్లీ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో లెక్కించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఇప్పటికే అక్కడి నియోజకవర్గాల వారీగా భద్రపరిచి గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఉండడం కోసం వాటిని రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూములలో ఉంచి సీల్‌వేశారు.
 
  ఓట్ల లెక్కింపు కోసం ఆదివారం ఉదయం వాటిని  రాజకీయ పార్టీల  ప్రతినిధుల సమక్షంలోనే తెరుస్తారు. స్థల లభ్యత, భద్రతా అవసరాల ఆధారంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎంపిక చేసి ఆయా ఓట్ల లెక్కింపు  కేంద్రాలను, వాటిలోఎన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును జరపాలన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. యమునా విహార్‌లోని రాజకీయ ప్రతిభా విద్యాలయ్‌లో రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగనుండగా, ద్వారకాలోని ఎన్‌ఎస్‌ఐటీ వంటి వాటిలో ఎనిమిది నియోజకవర్గాల  ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చడంతో పాటు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
 
  ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత కోసం రెండు వలయాల భద్రతను ఏర్పాటు చేశారు. లోపలి వలయంలో పారా మిలటరీ బలగాలను,  బయటి వలయంలో హోం గార్డులను మోహరించారు. శనివారం మరిం త మందిని మోహరించి వెలుపలి వల యాన్ని పటిష్ట పరుస్తారు. ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన కేంద్రాల బయట రాజకీయ పార్టీలు కూడా తమ ప్రతినిధులను నియమించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించింది.

Advertisement
Advertisement