పురిటి నొప్పులతో పది కిలోమీటర్లు నడిచి.. | Sakshi
Sakshi News home page

పురిటి నొప్పులతో పది కిలోమీటర్లు నడిచి..

Published Mon, Dec 26 2016 8:30 AM

పురిటి నొప్పులతో పది కిలోమీటర్లు నడిచి..

► మార్గమధ్యలో తానే పురుడు పోసుకున్న గిరిజన మహిళ
► వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో బిడ్డ నుంచి పేగును వేరు చేసిన వైనం
మారేడుమిల్లి 
నెలలు నిండిన గర్భిణులను సుఖ ప్రసవానికి ఆసుపత్రికి తరలించేందుకు కనీస చర్యలు తీసుకోకపోతుండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం మారేడుమిల్లి మండలం లోతట్టు ప్రాంతమైన కింటుకూరు గ్రామానికి చెందిన పాలించి లక్ష్మి నెలలు నిండటంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరం ఆసుపత్రికి వచ్చేందుకు భర్తతో బయలుదేరింది. 
 
ఇంతలో పురిటి నొప్పులు రావడంతో ఆ బాధ భరిస్తూనే కొండ ఎక్కి పది కిలోమీటర్లు నడుస్తూ వచ్చింది. దాహంగా ఉందంటూ భర్తను కాలువ నుంచి నీరు తేవాలని చెప్పింది. ఈలోపు నొప్పులు అధికమవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో బిడ్డ నుంచి పేగును వేరుచేసి పురుడు పోసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ పరిస్థితి గమనించిన ఓ యువకుడు మొబైల్‌ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లి 108కి సమాచారం ఇచ్చాడు. గంట తరువాత వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఆమెను తరలించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

Advertisement
Advertisement