అన్నాదురై జయంతి సందర్భంగాఘన నివాళి | Sakshi
Sakshi News home page

అన్నాదురై జయంతి సందర్భంగాఘన నివాళి

Published Mon, Sep 16 2013 4:05 AM

tribute to the centenary of Annadurai

అన్నాదురై జయంతి సందర్భంగా ప్రజలు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వాడవాడలా ఆయన చిత్రపటాలు ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్‌లు అన్నా విగ్రహాల వద్ద నివాళులర్పించారు.
 
 సాక్షి, చెన్నై:రాష్ట్ర ప్రజల ఆరాధ్యనేత అన్నాదురై. సెప్టెంబర్ 15న పార్టీలకతీతంగా అన్నా జయంతి నిర్వహిస్తుంటారు. ఆదివారం అన్నా 105వ జయంతి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయా పార్టీల నేతృత్వంలో వేర్వేరుగా కార్యక్రమాలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో అన్నా చిత్రపటాల్ని ఉంచి పూలమాలలు వేశారు. అన్నా సేవలు స్మరించుకున్నారు. పేదలకు అన్నదానం, సాయం పంపిణీ చేశారు.
 
 నేతల నివాళి: అన్నా జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు పన్నీర్ సెల్వం, పళనియప్పన్, వైద్యలింగం, మోహన్, మునుస్వామి తదితరులు అన్నాసాలైలోని అన్నా విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత అన్నా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వళ్లువర్‌కోట్టంలోని అన్నా విగ్రహం వద్ద డీఎంకే నేతృత్వంలో వేడుకలు జరిగాయి. డీఎంకే అధినేత కరుణానిధి, కోశాధికారి స్టాలిన్, ఎంపీ కనిమొళి, మాజీ మంత్రి దయానిధి మారన్, పార్టీ సీనియర్ నేత దురై మురుగన్, ఎమ్మెల్యే అన్భళగన్ తదితరలు పుష్పాంజలి ఘటించారు. డీఎండీకే కార్యాలయంలో జరిగిన వేడుకల్లో విజయకాంత్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అన్నాకు ఘనంగా నివాళులర్పించారు.
 
 మార్కెట్లోకి అమ్మ వాటర్
 అన్నా జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఏదో ఒక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ ఏడాది చల్లటి నీళ్లను ప్రయాణికులకు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అమ్మ మినరల్ వాటర్ పేరుతో సిద్ధం చేసిన ఈ బాటిళ్లను ముఖ్యమంత్రి జయలలిత మార్కెట్లోకి విడుదల చేశారు. ఆదివారం ఉదయం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.10 అందజేసి తొలి బాటిల్‌ను రవాణాశాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నుంచి ముఖ్యమంత్రి జయలలిత అందుకున్నారు. అనంతరం ఈ బాటిళ్లను ఆమె పరిచయం చేశారు. ఏడుగురు ప్రయాణికులకు ఈ బాటిళ్లను అందజేసి విక్రయాలకు శ్రీకారం చుట్టారు. లీటర్ బాటిల్ రూ.10 చొప్పున ప్రభుత్వ బస్సుల్లో, ప్రధాన బస్టాండ్‌లలో తొలి విడతగా విక్రయించనున్నారు.
 

Advertisement
Advertisement