నాణ్యత పెరిగింది | Sakshi
Sakshi News home page

నాణ్యత పెరిగింది

Published Sat, Jul 5 2014 10:14 PM

నాణ్యత పెరిగింది - Sakshi

టీవీ షోలలో నాణ్యత పెరిగిందని బాలీవుడ్ నటి  అమృత ప్రకాశ్ చెప్పింది. బుల్లితెరలో నటించడం కూడా తనకు ఇష్టమేనని ‘వివాహ్’ సినిమాలో అమృతారావుకు సోదరిగా నటించిన అమృత తన మనసులో మాట బయటపెట్టింది. బుల్లి తెర కథలు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంటాయంది. ‘1990 నాటి మాదిరిగానే బుల్లితెర ప్రయోగాల దశలో నడుస్తోంది. అప్పట్లో ‘రిస్తే’, స్టార్ బెస్ట్ సెల్లర్స్’ వంటి లఘుచిత్రాలు కూడా వచ్చాయి. గంటలోనే సిరీస్ మొత్తం పూర్తయ్యేది’ అని తెలిపింది.
 
 కాగా ‘స్మృతి’, ‘సాత్ ఫేరే’, ‘యే మేరే లైఫ్ హై’ సాత్ ఫేరే’ వంటి హిట్ ధారావాహికల్లో అమృత నటించింది. ప్రస్తుతం ‘సావధాన్ ఇండియా, ‘ఏ హై ఆషిఖి’, ‘గుమ్రాహ్’ తదితర ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాల్లో నటిస్తోంది. ‘ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాలు బాగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. వీటికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. లఘుచిత్రాలు కూడా టీవీల్లో ప్రవాహం మాదిరిగా వస్తున్నాయి. వీటి స్క్రిప్టులు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. కథలు గొప్పగా ఉంటున్నాయి’ అని అంది. కాగా 27 ఏళ్ల ఈ సుందరి సినిమాల్లోకి బాలనటిగా అడుగిడింది.
 
 ‘తుమ్ బిన్’, కోయీ మేరా దిల్ మే హై’ వివాహ్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. 2010లో ‘వుయ్ ఆర్ ఫ్యామిలీ’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది. అందులో అతిథి పాత్ర పోషించింది. మరి సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారంటూ మీడియా ప్రశ్నించగా ఒకే రకమైన పాత్రలున్న సినిమాల్లో నటించానంది. ఇదే పరంపర కొనసాగుతుందేమోననే భయంతో ఆ తర్వాత అనేక అవకాశాలొచ్చినా తిరస్కరించానని తెలిపింది. అయితే అది సరైన నిర్ణయమా?  కాదా ?అనే విషయం తనకు తెలియదంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement