పదవులు వద్దు | Sakshi
Sakshi News home page

పదవులు వద్దు

Published Sat, May 31 2014 12:50 AM

పదవులు వద్దు

 - నా వారసుడు పార్టీలోకి రాడు
 - ప్రధాని మోడీకి విధేయులం  
 - స్పష్టం చేసిన వైగో

సాక్షి, చెన్నై: తనకు రాజ్యసభ పదవి వద్దే వద్దని, తన వారసుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఎండీఎంకే నేత వైగో తేల్చారు. ఆ పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు చర్చలు సాగారుు. ప్రధాని నరేంద్ర మోడీకి విధేయతను చాటుకుని ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా మరో ఉద్యమానికి సిద్ధమవుదామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు డీఎంకేలో ఏర్పడ్డ చీలికతో ఆవి ర్భవించిన పార్టీ ఎండీఎంకే. వైగో నేతృత్వంలోని ఈ పార్టీలోకి అప్పుడు డీఎంకే నుంచి పెద్ద సంఖ్యలో వలసలు వచ్చారు.

పార్టీలో ఒకప్పుడున్న ముఖ్య నాయకుల్వెరూ ఇప్పుడు లేరు. అయినా డీలా పడకుండా పార్టీని వైగో నెట్టుకొస్తూ ఉన్నారు. అనివార్య కారణాలతో అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించినా, లోక్ సభ ఎన్నికల ద్వారా తన ఉనికి చాటుకునే యత్నం చేశారు. డిపాజిట్లు గల్లంతైనా, తన పయ నం మాత్రం ఆగదంటూ, ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడి గతంలో ఉద్యమాలు చేశారో, దాన్ని కొనసాగించేందుకు వైగో సిద్ధం అయ్యారు. ఎన్నికల సమయంలో బీజేపీ తమకు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీ లు, కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై పట్టు విడుపుగా ముందుకెళ్లేందుకు వైగో నిర్ణయించారు.

అలాగే, ప్రధా ని మోడీకి విధేయతను చాటుకునే పనిలో పడ్డారు. ఉన్నత స్థాయి భేటీ: తాయగంలో గురువారం జిల్లా, డివిజన్, పార్టీ సలహా కమిటీ,  రాష్ట్ర కమిటీ సమావేశాన్ని వైగో ఏర్పాటు చేశారు. రాత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి మాత్ర మే చర్చించారు. ఎన్నికల వేళ పొత్తు కుదుర్చునే సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలపై పట్టుబడదామని కొందరు నేతలు వాదించినా, వాటిని వైగో తిరస్కరించడం విశేషం.

ఎన్నికల్లో ఓడిన తనకు రాజ్యసభ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నా, పుచ్చుకునేందుకు తాను  సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రం తరపున రాజ్యసభకు వెళ్లి, ఆ రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు.

తనకు ఏ పదవులూ వద్దు అని, ఈలం తమిళుల సంక్షేమం, తమిళుల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీతో కలసి పనిచేద్దామని, విధేయతను చాటుకుందామని సూచించారు. అవసరం అయితే, తమిళుల కోసం మరో ఉద్యమాన్ని చేపట్టి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దామని వివరించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలాన్ని పుంజుకుని రాష్ట్రంలో సత్తాను చాటుకుందామని, ఇందుకు ప్రతి ఒక్కరూ రెండేళ్లు మరింతగా శ్రమించాలని పిలుపు నిచ్చారు.
 
వారసుడు రాడు: ఎండీఎంకే నేత వైగో కుమారుడు దురై వయ్యాపురి. తండ్రికి సహకారంగా తరచూ కొన్ని కార్యక్రమాల్లో ఈయన కన్పిస్తుంటారేగానీ ప్రత్యక్ష రాజకీయల్లోకి రాలేదు. పార్టీలో ఎలాంటి జోక్యం ఉండదు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్‌లో క్రియాశీలక పాత్రను దురై వయ్యాపురి పోషించారు. దీంతో ఎండీఎంకేలోకి  వారసుడొస్తున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. ఎండీఎంకే యువజన పగ్గాలు చేపట్టబోతున్నారని, వైగో తర్వాత ఆ పార్టీకి దురై వయ్యాపురి నేతృత్వం వహిస్తారన్నట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వీటన్నింటికీ ముగింపు పలికే విధంగా ఉన్నత స్థాయి భేటీలో వైగో స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. వయ్యాపురిని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ కొందరు నేతలు ఇచ్చిన సూచనకు స్పందించిన వైగో,  వయ్యాపురికి రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. విరుదునగర్‌లో తాను పోటీ చేసిన దృష్ట్యా, తనకు మద్దతుగా ప్రజల్లోకి వయ్యాపురి వచ్చాడేగానీ రాజకీయాల్లోకి రావాలన్న తలంపుతో మాత్రం కాదని వివరించారు.  తన వారసుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని, తన కుటుంబానికి చెందిన వాళ్లెవరూ రారంటూ, ఎండీఎంకే కుటుంబ పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండంటూ పరోక్షంగా డీఎంకేను ఎత్తి చూపుతూ వ్యాఖ్యలు చేసినట్టుగా ఆపార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.

Advertisement
Advertisement