కష్టాల వర్దా | Sakshi
Sakshi News home page

కష్టాల వర్దా

Published Fri, Dec 16 2016 2:37 AM

varda cyclone effect in tamilnadu

► చీకట్లో చెన్నై శివార్లు
►నగరంలో ఆందోళనలు
► మంత్రి కారు ముట్టడి
►50 వేల హెక్టార్లలో పంట నష్టం
►త్వరలో రాష్ట్రానికి కేంద్ర  బృందం రాక


వర్దా తుపాను తమిళనాడును కకావికలంచేసింది. పచ్చని చెట్లను నేలకూల్చింది.విద్యుత్‌ స్తంభాల్ని విరిచేసింది. ఈకష్టాలు.. కన్నీళ్ల నుంచి జనం ఇంకాతేరుకోలేదు . చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో మూడు రోజులైనా సాధారణ పరిస్థితులు కానరావడం లేదు.


సాక్షి ప్రతినిధి, చెన్నై: గత ఏడాది డిసెంబర్‌లో ఏర్పడిన వరద బీభత్సాన్ని ప్రజలు మరువక ముందే ఈ నెల 12వ తేదీన వర్దా తుపానుతో మరో విలయతాండవాన్ని చవిచూశారు. గంటకు 130–140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల దెబ్బకు మూడు జిల్లాలు కకావికలమయ్యాయి. వర్దా విలయతాండవం ముగిసి మూడు రోజులైనా విషాదకర దృశ్యాలు ఇంకా అలానే ఉన్నాయి. ఒక్క చెన్నై నగరం
లోనే లక్షవృక్షాలు నేలకొరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రధాన రహదారుల్లో అడ్డంగా పడిన వృక్షాలను తొలగించినా ఇతర రోడ్లలో భారీ వృక్షాలు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి. నగరంలో 238 రహదారులు కూలిపోయిన వృక్షాలతో నిండిపోయాయి. సుమారు 20వేల మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నా పనులు వేగంగా సాగడం లేదు. రోడ్లకు ఇరువైపునా  కూలి ఉన్న వృక్షాలతో చెన్నై నగరం అడవిని తలపిస్తోంది. మూడురోజుల్లో మొత్తం వృక్షాలను తొలగిస్తామని కార్పొరేషన్ హామీ ఇస్తాంది. ప్రస్తుతం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు.

విద్యుత్‌ సరఫరా పునునరుద్ధరణకు 8వేల మంది పనిచేస్తున్నా ఇంకా అనేక ప్రాంతాలు చిమ్మచీకట్లో ముగ్గుతున్నాయి. విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ తండియార్‌పేట, పుదువన్నార్‌పేట, వవుసీనగర్‌ తదితర ఆరు ప్రాంతాల్లో గురువారం ప్రజలు రాస్తారోకో జరిపారు. తిరువొత్తియూరు, దాని పరిసర ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు సౌకర్యాన్ని  పునరుద్ధరించాలని కోరుతూ మంత్రి కరుప్పన్నన్ కారును బాధితులు అడ్డగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీకి దిగడంతో ప్రజలు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో సహాయ కమిషనర్, ఇన్‌స్పెక్టర్లకు గాయాలయ్యాయి. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని, రెండురోజుల్లో పూర్తవుతాయని విద్యుత్‌ శాఖా మంత్రి తంగమణి తెలిపారు. విద్యుత్‌ పునరుద్ధరణకు ఐఏఎస్‌ అధికారి సబితా నేతృత్వంలో గురువారం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. విద్యుత్‌ కోసం శివారు ప్రాంతాల ప్రజలు జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. నిత్యావసరాలకు సైతం నీళ్లు లేకపోవడంతో జనరేటర్లకు గంటకు రూ.2వేలు అద్దె చెల్లిస్తున్నారు. వర్దా తుపాన్ శాంతించినా రాష్ట్రం లో అక్కడక్కడ వర్షాలు కరుస్తూనే ఉన్నా యి. ఊటి కొండ రోడ్డు మార్గంలో కొండచ రియలు విరిగి పడడంతో మూడున్నర గంటల పాటూ ట్రాఫిక్‌ స్తంభించింది

50వేల హెక్టార్లలో పంట నష్టం:
కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో 50వేల హెక్టార్లలో పంటనష్టం సంభవించడంతో రైతన్నలు బావురుమంటున్నారు. అరటి, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి.  కాంచీపురంలో 55వేల ఎకరాల్లో వరిసాగు కోతలకు వచ్చింది. వర్దా తుపానుతో చేతికందిన పంటను కోల్పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. కాంచీపురం, చెంగల్పట్టు, ఉత్తిరమేరూరు ప్రాంతాల్లో 10వేల ఎకరాల చెరుకుతోట, 10వేల ఎకరాల అరటితోట దెబ్బతింది. తిరువళ్లూరు జిల్లాలో మాత్రమే 30వేల హెక్టార్ల పంటనష్టం సంభవించినట్లు అంచనా.

త్వరలో కేంద్ర బృందం రాక:
వర్దా తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు త్వరలో కేంద్రబృందం రాష్ట్రానికి చేరుకోనుంది. వర్దా తుపాన్ వల్ల రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా. తుపాన్ సహాయార్థం వెంటనే రూ.1000 కోట్లు కేటాయించాల్సిందిగా సీఎం పన్నీర్‌సెల్వం రెండురోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రం రెండు రోజుల్లో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపి నష్టం అంచనాలు సిద్ధం చేసేందుకు అంగీకరించింది.

Advertisement
Advertisement