అమ్మవైపు.. విజయధరణి చూపు | Sakshi
Sakshi News home page

అమ్మవైపు.. విజయధరణి చూపు

Published Sun, Jan 24 2016 3:25 AM

అమ్మవైపు.. విజయధరణి చూపు - Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ నుంచి బహిష్కరణ వేటుకు గురైన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు విజయధరణి అమ్మ పంచన చేరేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జయలలితను ఆమె ప్రత్యక్షంగా కలవడం దీనికి మరింత ప్రాధాన్యత  సంతరించుకుంది. తమిళ కాంగ్రెస్‌లో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా, చురుకైన నేతగా పేరొందిన విజయధరణికి తనదైన బలం, బలగం ఉంది. పైగా లా పట్టా పుచ్చుకున్న విద్యాధికురాలు.

ఇందిరాగాంధీ జయంతి రోజున మహిళా కాంగ్రెస్ సత్యమూర్తి భవన్ వద్ద పెట్టిన ఫ్లెక్సీలో ఇళంగోవన్ బొమ్మ చిన్నదిగా ఉండటం, విజయధరణి బొమ్మ ఇందిరాగాంధీ చిత్రం కంటే ప్రముఖంగా ఉండటం గొడవకు దారితీసింది. ఇళంగోవన్ అనుచరులు ఆ ఫ్లెక్సీని చించడంతో విజయధరణి సమావేశంలోనే నేతలను నిలదీశారు. కాంగ్రెస్‌లో ఇటీవలే చేరి ఓ మోస్తరు పెత్తనం సాగిస్తున్న పార్టీ అధికార ప్రతినిధి, నటి కుష్బుతోపాటు ఇటీవల చెన్నైకి వచ్చిన పార్టీ జాతీయ నాయకురాలు నటి నగ్మా సైతం విజయధరణిపై అధిష్టానానికి చాడీలు మోసారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌తో ఢీ అంటే ఢీ అనే తెగువ ఉన్న మగువ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆలోచించింది.

 ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు విజయధరణి వంటి దీటైన వనిత అవసరమని అధిష్టానం మూడు నెలల పాటు ఆలోచించింది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా కలహాల కాంగ్రెస్ కష్టమని భావించిన అధిష్టానం ఎట్టకేలకూ విజయధరణిని పార్టీ నుంచి బహిష్కరించింది. మాజీ ఎమ్మెల్యే పొన్నమ్మాళ్ మనుమరాలు ఝాన్సీరాణికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టంకట్టింది.

 అన్నాడీఎంకేపై ఆసక్తి
 కాంగ్రెస్ నుంచి వేటు పడగానే వేగంగా పావులు కదిపిన విజయధరణి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైంది. రాజకీయ ఊహాగానాలకు తావులేకుండా అన్నిపార్టీల ఎమ్మెల్యేలు చూస్తుండగానే అసెంబ్లీ హాలు ప్రాంగణం వద్దనే అమ్మకు హలో చెప్పి ఒక వినతిపత్రం సమర్పించింది. మిమ్మల్ని ప్రత్యేకంగా కలవాలని కోరుకుంటున్నానని చెప్పగా చిరునవ్వు చిందించిన జయ అలాగే చూస్తాను అంటూ వెళ్లిపోయారు.

 ఎమ్మెల్యే పదవి పదిలం : ఇళంగోవన్
 కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతురాలైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయధరణి కొనసాగుతుందని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో జరిగిందేదో జరిగిపోయింది, వాటిపై వ్యాఖ్యానాలు వద్దు అన్నారు. పార్టీ వేటు పడినా ఎమ్మెల్యేగా ఆమె కొనసాగేందుకు కాంగ్రెస్ అడ్డుపడదని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement