‘పెద్ద నోట్లు మేము తీసుకుంటాం.. రండీ’ | Sakshi
Sakshi News home page

‘పెద్ద నోట్లు మేము తీసుకుంటాం.. రండీ’

Published Thu, Nov 10 2016 1:38 PM

‘పెద్ద నోట్లు మేము తీసుకుంటాం.. రండీ’ - Sakshi

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ. వెయ్యి నోట్లను ఉపసంహరించడంతో పెద్ద నోట్లు తీసుకునేందుకు అందరూ వెనుకాడుతుంటే విజయవాడ వస్త్ర వ్యాపారులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పెద్ద నోట్లతో రండి దర్జాగా షాపింగ్‌ చేయండి అంటూ వినియోగదారులకు స్వాగతం పలుకుతున్నారు. వ​న్‌ టౌన్‌ లోని వస్త్రలత వ్యాపార సముదాయంలో పెద్ద నోట్లను తీసుకునేందుకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. దీంతో ఇక్కడ బట్టలు కొనేందుకు వినియోగదారులు భారీగా తరలివస్తున్నారు. కొనుగోళ్లదారులతో వస్త్రలత వ్యాపార సముదాయం సందడిగా మారింది.

బిల్లులు ఇచ్చి చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వ్యాపారులు అంటున్నారు. అయితే డిసెంబర్‌ 30 వరకు పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వీలుండడం వీరి దీమాకు కారణమైవుండొచ్చని భావిస్తున్నారు.

మరోవైపు నగరంలోని మిగతా ప్రాంతాల్లో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దనోట్ల రద్దు హోల్‌ సేల్‌ మార్కెట్‌ లో నామమాత్రంగా లావాదేవీలు జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్‌, బస్టాండుల్లో చిల్లర కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. దేవాలయాల్లో సైతం పెద్ద నోట్లను అంగీకరించడం లేదు.

Advertisement
Advertisement