రానున్న పదేళ్లు దేశాభివృద్ధికి ఎంతో కీలకం | Sakshi
Sakshi News home page

రానున్న పదేళ్లు దేశాభివృద్ధికి ఎంతో కీలకం

Published Sun, Mar 23 2014 6:20 AM

Vital development in the next ten years

‘మీట్ ది ప్రెస్’లో ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా

సాక్షి, బెంగళూరు: రానున్న పదేళ్లు భారతదేశ అభివృద్ధికి ఎంతో కీలకమైనవని ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశ అభివృద్ధి ఒక కూడలి వరకు చేరుకుందని, కూడలి వద్ద కనిపిస్తున్న మార్గాల్లో ప్రజలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే విషయంపై భారతదేశ  భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చిన బయోటెక్, నానోటెక్, స్టెమ్ టెక్నాలజీ వంటి ఎన్నో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఎన్నో సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపుతున్నాయని, అయితే వాటిని మనం సరైన దారిలో ఉపయోగించుకోవడం లేదని అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఎప్పుడో రూపొందించిన విద్యా బోధనా విధానాలనే మనం అనుసరిస్తున్నామంటే మార్పును స్వాగ తించడానికి ఎంత మాత్రం ఇష్టపడుతున్నామనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు.

క్రికెట్, బాలీవుడ్ గాసిప్స్, రాజకీయాలు వంటి విషయాలపై చర్చించేందుకు తప్ప దేశంలో ఎలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై ప్రజలతో పాటు మీడియా కూడా చర్చించడం లేదని అన్నారు. అందుకే అసలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతోందనే విషయంపై ప్రజలు కనీస సమాచారం కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
యువతకు సరైన అవకాశాలు కల్పిస్తేనే....

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్‌లోనే ఎక్కువ సంఖ్యలో యువత ఉందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. అయితే భారత్‌లోని యువతకు సరైన అవకాశాలు కల్పించినప్పుడే ప్రపంచ దేశాలకు భారత్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ఇక ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ శాతం యువతే ఉన్నా అన్ని రంగాల్లోనూ విధి విధానాలను రూపొందించే వారు మాత్రం 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారే ఉంటున్నారని అన్నారు.

ఆ విధానాలను అనుభవించే వారు మాత్రం 20ఏళ్ల వారై ఉంటున్నారని తెలిపారు. అమెరికా మోడల్‌ను కాపీ కొట్టడం కాకుండా సొంత ఆలోచనలకు పదును పెట్టడం ద్వారా భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపేందుకు ఆస్కారం ఉంటుందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు.
 
సూపర్ పవర్ అని ఎలా అంటారు....
 
భారతదేశంలో 300 మిలియన్‌ల మంది ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటే భారత్‌ను సూపర్ పవర్‌గా ఎలా అభివర్ణిస్తారని శ్యామ్ పిట్రోడా ప్రశ్నించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాలు కల్పించిన తరువాత భారత్‌ను సూపర్ పవ ర్‌గా చెప్పుకోవచ్చని, అప్పటి దాకా సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు.

ఇక ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి అందుబాటులోకి తెచ్చిన పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి కూడా భారత్‌లో చాలా మంది ఇష్టపడడం లేదని, ఐటీ శాఖలోని ఉద్యోగులే ఆ శాఖకు చెందిన వివిధ పత్రాలను ఇప్పటికీ కంప్యూటర్‌లో పొందుపరచకుండా ఫైల్స్ రూపంలోనే ఉంచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement