Sakshi News home page

నీటిబిల్లులు మాఫీ చేస్తాం

Published Fri, Jan 23 2015 11:31 PM

నీటిబిల్లులు మాఫీ చేస్తాం

అధికారంలోకివస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం
వితంతువులకు రూ.2 వేల పింఛను చెల్లిస్తాం
డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ

 
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టో మొదటి భాగాన్ని శుక్రవారం విడుదల చేసింది. విద్యుత్తు చార్జీలను తగ్గిస్తామని, నీటి బిల్లులు, సీవర్ బిల్లులు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ఓటర్లకు హామీ ఇచ్చింది. మానిపెస్టోను విడుదల చేసిన డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, ఎన్నికల ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ ఢిల్లీవాసులు మరోమారు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడ్తారన్న ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ప్రకారం.. 200 యూనిట్ల వరకు విద్యుత్తు వాడే వినియోదారులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున చార్జీ విధిస్తామని, వితంతువులకు, వృద్ధులకు నెలకు రూ. 2 వేలు పింఛను ఇస్తారు. మేనిఫెస్టోను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు. రెండవ భాగాన్ని రూపొందిస్తున్నామని రెండు మూడు రోజుల తర్వాత దానిని విడుదల చేస్తామని ఆయన చెప్పారు. మేనిఫెస్టో విడుదలలో కాంగ్రెస్ మిగతా పార్టీల కన్నా ముందు నిలిచింది. తమ పార్టీ బీజేపీ, ఆప్‌లకు భిన్నమైనదని మేనిఫెస్టో విడుదల చేసిన లవ్లీ ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలపై ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.

ముఖ్యంగా గృహవినియోగదారులకు 200 యూనిట్ల వరకు విద్యుత్తు రూ.1.50 లకే యూనిట్ చొప్పున అందిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలోనూ, పబ్లిక్ ప్లేస్‌లలో ఉచిత వైఫై సదుపాయంపై ఇచ్చిన హామీలోనూ ఆప్ ప్రభావం కనిపించింది. గతంలో  విద్యుత్తు చార్జీలను తగ్గించడం సాధ్యం కాదన్న కాంగ్రెస్ ఇప్పుడు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని హామీ ఇవ్వడం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు లవ్లీ సమాధానమిస్తూ అప్పుడు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయడానికి తాము ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు చార్జీల తగ్గింపుపై దృష్టి పెట్టామని చెప్పారు. మేనిఫెస్టోలో ఏమేం అంశాలను చేర్చాలనే దానిపైనే కాక ఎలా  వాటిని ఎలా అమలుచేయాలనే దానిపై కూడా తాము పూర్తి స్పష్టతతో ఉన్నట్లు మాకెన్ చెప్పారు.

 నగరంలో ఉన్న ఆస్పత్రులలో అన్ని డయోగ్నోస్టిక్ సెంటర్లు 24 గంటలు పనిచేసేలా అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచుతామని లవ్లీ చెప్పారు. మెట్రో నాలుగవ దశలో విద్యార్థులకు రాయితీ సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో 150 స్కూళ్లు, అంబేద్కర్ యూనివర్సిటీ కింద 20 కాలేజీలు తెరుస్తామని పేర్కొన్నా. ఉన్నత విద్య, ప్రొషషనల్ కోర్సుల్లో ఈడబ్ల్యుఎస్ కోటా అమలుచేస్తామని, నర్సరీ అడ్మిషన్లపై అయోమయం తొలిగించడానికి ప్రైవేటు పాఠశాలలకు స్థలం కేటాయిస్తామని, పేద పిల్లల కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రభుత్వం ఇంటర్నెట్ కెఫేను తెరుస్తుందని చెప్పారు. పారిశుద్ధ్య శాఖలో కాంట్రాకు కార్మికుల పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. అన్నశ్రీ యోజన కింద ప్రతి వ్యక్తికి 7 కిలోల గోధుమలు, ఒక కిలో బియ్యం ఇస్తామన్నారు. ఉత్తరాఖండ్ వాసులను ఆకర్షించడం కోసం ఉత్తరాణీ మేళా ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. లాల్ డోరా పరిధిని విస్తరించి మరిన్ని అనధికార కాలనీలను క్రమబద్ధీరిస్తామని హామీ ఇచ్చారు. జుగ్గీజోపిడీలు, మురికివాడల్లో నివసించేవారికి ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తామని, మహిళల భద్రత కోసం ప్రజారవాణా సాధనాలలో సీసీటీవీ కెమెరాలను అమరుస్తామని హామీ ఇచ్చారు.
 
 

Advertisement
Advertisement