నానో టెక్నాలజీతో పరిశుభ్రమైన నీరు | Sakshi
Sakshi News home page

నానో టెక్నాలజీతో పరిశుభ్రమైన నీరు

Published Tue, Feb 9 2016 2:07 AM

With nano-technology clean water

భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు
 
బెంగళూరు: నానో టెక్నాలజీని నీటి శుద్ధీకరణలో వినియోగిస్తే దేశంలోని ప్రజలందరికీ పూర్తిగా పరిశుభ్రమైన నీటిని అందజేయవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు పేర్కొన్నారు. సోమవారమిక్కడ ‘నానో టెక్నాలజీ’ పై నిర్వహించిన సమావేశంలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో నీరు రోజురోజుకు కలుషితమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిలో ఫ్లోరైడ్‌తో పాటు యురేనియం వంటి కాలుష్యాలు కలుస్తుండడంతో ప్రజల్లో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. అందువల్ల న్యా నో టెక్నాలజీ ద్వారా పూర్తిగా శుద్ధమైన నీటిని ప్రజలకు అందజేసేందుకు ఆస్కారం ఉందని అన్నారు. ఇక వ్యవసాయ రంగంలో సైతం న్యానో టెక్నాలజీని వినియోగించడం ద్వారా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించవచ్చని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా అన్నింటా నానో టెక్నాలజీని వినియోగించుకోవచ్చని సూచించారు.

రోజురోజుకు ప్రకృతిలో వస్తున్న మార్పులు, పెరిగిపోతున్న వ్యాధులు, తదితరాలను ఎదుర్కొనడం అంత సులువైన విషయం కాదని, శాస్త్ర, సాంకేతిక రంగంలో సైతం వినూత్న ఆవిష్కరణలు వచ్చినప్పుడే ఈ సమస్యలను ఎదుర్కొనడం సాధ్యమవుతుందని అన్నారు. ఇక ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించి జపాన్, బ్రిటన్‌లు మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. కాగా, బెంగళూరు ఇండియా నానో సమ్మేళనం బెంగళూరులోని హోటల్ లలిత్ అశోకాలో మార్చి 3 నుంచి 5వరకు కొనసాగనుందని ఈ సందర్భంగా సి.ఎన్.ఆర్.రావు వివరించారు. ఈ సమావేశంలో 60 మంది శాస్త్రవేత్తలు, బ్రిటన్, అమెరికా, జర్మనీ తదితర దేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు.
 

Advertisement
Advertisement