పుట్టిన రోజుకని వెళ్లి. .. బాంబుకు బలైంది | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజుకని వెళ్లి. .. బాంబుకు బలైంది

Published Tue, Dec 30 2014 9:05 AM

పుట్టిన రోజుకని వెళ్లి. .. బాంబుకు బలైంది - Sakshi

చెన్నై, సాక్షిప్రతినిధి: బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు చెన్నైకి చెందిన కుటుం బంలో విషాదాన్ని నింపింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తానని భర్తకు చెప్పి బెంగళూరుకు వెళ్లిన భవాని (37) పుణ్యలోకాలకు వెళ్లిపోయింది. చక్కనైన వ్యాపారం, ఇద్దరు పిల్లలతో కళకళలాడే ఆ కాపురంలో కన్నీళ్లు నింపింది. చెన్నై మౌంట్‌రోడ్డు ఎల్‌ఐసీ వెనుకవైపున ఉన్న ఆటో బజారులో భవాని భర్త బాలన్ టైర్ల కంపెనీని నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు లక్ష్మీదేవీ, భరత్ ఉన్నారు. బెంగళూరులోని బంధువుల ఇంటిలో జరిగే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు భవాని, ఇద్దరు పిల్లలు, వీరి బంధువులు మొత్తం 8 మంది వెళ్లారు. బెంగళూరులో ఎంబీఏ చదివే కార్తీక్ (27) ఇటీవలే చెన్నైకి వచ్చి తిరుగు ప్రయాణంలో భవానీ కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని బెంగళూరు వెళ్లాడు.
 
 పుట్టినరోజు వేడుకల్లో సంతోషంగా పాల్గొన్న భవాని ఆదివారం రాత్రి చెన్నై బయలుదేరేందుకు రైల్ టికెట్ రిజర్వు చేసుకుంది. అయితే టికెట్ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. ప్రయాణం ఎలాగూ రద్దయింది కదా అని తన ఇద్దరు పిల్లలు వెంటరాగా కార్తీక్‌ను తోడుతీసుకుని ఆదివారం షాపింగ్‌కు బయలుదేరింది. వస్తువులను కొనుగోలు చేస్తూ ఫ్లాట్‌ఫామ్ మీద నడుస్తుండగా బాంబు పేలుడు సంభవించింది. భవాని, కార్తిక్‌తో పాటూ మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవాని తలకు బలంగా గాయమడంతో తీవ్ర రక్తస్రావమైంది. పేలుడు దాటికి పరుగులు తీసిన జనం నెమ్మదిగా ప్రమాదస్థలికి చేరుకున్నారు. ముఖమంతా రక్తం ముద్దగా మారిన స్థితిలో రోడ్డుపై పడివున్న భవానిని చూసి గుమిగూడిన ప్రజలంతా మానవబాంబుగా భావించారు.
 
 ఎవరూ ఆమె దగ్గరికి చేరేందుకు,  సాహసించలేదు. తీవ్రగాయాలకు గురై సమీపంలోనే పడి వున్న కార్తీక్ స్థానికులను పిలిచి విషయం చెప్పడంతో, ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటిలోనే ఆమె కన్నుమూశారు. షాపింగ్ సమయంలో భవాని, కార్తిక్‌తో కలిసి నడిచిన ఇద్దరు పిల్లలూ పేలుడుకు కొద్దిసేపటికి ముందు అక్కడి స్టేడియంలో ఆడుకుంటామని చెప్పి వెళ్లడంతో అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బైటపడ్డారు. భవాని మృతి చెందిన సమాచారంతో భర్త బాలన్, మరికొందరు కుటుంబ సభ్యులు రాత్రికిరాత్రే బెంగళూరుకు చేరుకున్నారు. పోస్టుమార్టం ముగిసిన తరువాత భవాని మృతదేహాన్ని చెన్నైకి తీసుకువస్తారని తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతురాలు భవాని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

Advertisement
Advertisement