తాగునీటి ఎద్దడిపై సభ్యుల ఆగ్రహం | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడిపై సభ్యుల ఆగ్రహం

Published Thu, May 22 2014 4:05 AM

Wrath of the fool-proof method of drinking water

  • సమస్య పరిష్కరించాలని డిమాండ్
  •  చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : నగరంలో నానాటికీ జఠిలమవుతున్న తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నగరసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన నగరసభ సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చైర్‌పర్సన్ లీలావతి మాట్లాడుతూ.. చిక్కబళ్లాపురానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న జక్కలమడుగు జలాశయం నుంచి మే నెల చివరి వరకూ నీరు అందాల్సి  ఉందని తెలిపారు.
     
    అయితే జలాశయం ఏప్రిల్ మొదటి వారానికి ఖాళీ అయిందని, ఈ జలాశయం నుంచి 33 శాతం నీరు దొడ్డబళ్లాపురానికి వెళుతోందని తెలిపారు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లో ఫుట్‌బాల్‌ను రెండున్నర అడుగులు పెంచినందున నిర్ణీత శాతానికన్నా ఎక్కువగా నీరు ఆ ప్రాంతానికి వెళుతోందని, ఫలితంగా చిక్కబళ్లాపురానికి నీరు తక్కువగా అందుతోందని రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ విషయంపై నీటి సరఫరా అధికారిని సభ్యులు నిలదీశారు.

    నగరసభ కమిషనర్ మునిశామప్ప జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. జిల్లాకు నీరు తక్కువగా వస్తోందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు సైతం వివరించడం జరిగిందని గుర్తు చేశారు. కమిషనర్ సమాధానంతో సభ్యులు మహకాళీబాబు, కిసాన్ కృష్ణప్ప, శ్రీనివాస్ తదితరులు ఏకీభవించలేదు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లోని ఫుట్‌బాల్‌ను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    అధికారికంగా ఈ చర్యను చేపట్టకపోతే గురువారం ఉదయం సభ్యులే అక్కడికెళ్లి ఫుట్‌బాల్‌ను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యక్షురాలు జబీన్‌తాజ్, సభ్యులు ఎ.బి.మంజునాథ్, రఫీక్, నిర్మల ప్రభు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.  
     

Advertisement
 

తప్పక చదవండి

Advertisement