Sakshi News home page

హత్య కేసులో మహిళకు యావజ్జీవం

Published Fri, Jun 10 2016 1:21 AM

హత్య కేసులో మహిళకు యావజ్జీవం

కేకే.నగర్: ప్రియుడి కుమారుడిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసి సూట్‌కేసులో శవాన్ని తీసుకెళుతూ పట్టుబడిన పూవరసికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను మద్రాసు హైకోర్టు సమర్థించింది. చెన్నై, విరుగంబాక్కం ఎంజీఆర్ నగర్‌కు చెందిన విజయకుమార్‌కు 2000 సంవత్సరం అనంతలక్ష్మి అనే యువతితో వివాహం జరిగింది.
 ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నాడు. జయకుమార్ చెన్నైలోని ప్రైవేటు సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఇతనితో పాటు పనిచేసే పూవరిసిని జయకుమార్ ప్రేమించాడు.
 
 కొన్ని సంవత్సరాలు ఇద్దరూ సహజీవనం చేశారు. కుటుంబాన్ని వదిలి తనతో రమ్మని పూవరసి కోరిందని దానికి  జయకుమార్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ స్థితిలో మదురైలో పూవరసికి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జయకుమార్‌ను మదురైకు రమ్మని పిలిచింది. అతడు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన పూవరసి జయకుమార్ కుమారుడు ఆదిత్యను 2010 జులై 17న కిడ్నాప్ చేసింది. ఆమె బసచేసిన వైఎంసీఏ హోటల్‌లో ఆదిత్యను హత్య చేసి సూట్‌కేసులో పెట్టింది. తరువాత చిన్నారి మృతదేహాన్ని సూట్‌కేసు సహా నాగపట్టణం బస్సులో ఉంచి పారిపోయింది. ఆమెను చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు.
 
  పోలీసుల విచారణలో తనను జయకుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అతడిపై పగ తీర్చుకోవడానికి అతడి కుమారుడు ఆదిత్యను హత్య చేశానని పోలీసులకు పూవరసి తెలిపింది. ఈ కేసుపై విచారణ జరిపిన చెన్నై ఆరవ అదనపు సెషన్స్ కోర్టు 2012లో పూవరసికి యావజ్జీవ శిక్ష విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పూవరసి తరఫున మద్రాసు హైకోర్టులో అప్పీలు చేశారు.
 
 ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన నుంచి ఆదిత్యను వేరే వ్యక్తులు కిడ్నాప్ చేశారని, దీనిపై పోలీసులు సరిగ్గా విచారణ జరపలేదని, తనకు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేయాలని పూవరసి కోరింది. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. కేసు పరిశీలించిన న్యాయమూర్తులు పూవరసిపై కిడ్నాప్, హత్య నేరాలు రుజువుకావడంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చారు. కిడ్నాప్, హత్యకు కలిపి మరో యావజ్జీవాన్ని విధించి రెండు యావజ్జీవ శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు విధించిన జరిమానా రూ.లక్షను రూ.30 వేలకు తగ్గిస్తూ న్యాయమూర్తులు తీర్పునిచ్చారు.
 

Advertisement

What’s your opinion

Advertisement