‘కన్నీటి సునామీలో బాబు కొట్టుకుపోతాడు’ | Sakshi
Sakshi News home page

‘కన్నీటి సునామీలో బాబు కొట్టుకుపోతాడు’

Published Thu, Dec 8 2016 5:40 PM

‘కన్నీటి సునామీలో బాబు కొట్టుకుపోతాడు’ - Sakshi

రేఖపల్లి: దాదాపు మూడేళ్లుగా పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును అందరూ కోరుకుంటున్నారని, అయితే, ఆ ప్రాజెక్టుకోసం భూములిచ్చిన గిరిజనుల బాధలు ఎవరికీ పట్టవా అని ప్రశ్నించారు. వారి కష్టాల గురించి ప్రభుత్వానికి గుర్తు చేయడం ధర్మం కాదా.. నిలదీసిన వ్యక్తులపై నిందలు వేస్తారా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తండ్రిగా ఉండాలని.. ఆయన వస్తే సంతోషపడాలని, కానీ చంద్రబాబు వస్తుంటే ప్రజలు బాధపడుతున్నారని, ఆయన అడుగుపెట్టిన ప్రతిచోట ప్రజలను మోసం చేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం రేఖపల్లిలో జరిగిన పోలవరం నిర్వాసితుల పోరు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా చంద్రబాబు ఏపీని ప్రకటించారని, కానీ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్కూలు విద్యార్థులకు కూడా బాత్‌ రూములు లేని పరిస్థితి ఉందని, పిల్లలు చెంబులు పట్టుకొని కొండలు ఎక్కుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా సిగ్గు లేకుండా స్వచ్ఛభారత్‌కు తానే అంబాసిడర్‌ అని చంద్రబాబు ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు. చింతూరు జూనియర్‌ కాలేజీలో కూడా తమకు బాత్‌ రూములు లేవని, ల్యాబ్‌లు లేవని విద్యార్థులు, రెండేళ్ల నుంచి జీతాలు కూడా రావడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.



అసలు చంద్రబాబు ముఖ్యమంత్రికి అర్హుడేనా అని ప్రశ్నించారు(ఈ సమయంలో ప్రజల నోట కాదు అని అరుపులు). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు వైద్యులు కనీసం ఉండాలని, కానీ ఒక్కరు కూడా అందుబాటులో లేరని, వైద్యానికి దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జీడీపీలో నాలుగో స్థానంలో ఉందని చంద్రబాబు ప్రకటిస్తున్నారని, సులువుగా ప్రజల చెవుల్లో పూలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు. విలీన మండలాల్లో నాలుగు నెలల్లో కాళ్ల వాపు వ్యాధితో ఇప్పటికే 14మంది చనిపోయారని, వైద్యం అందక, వైద్యులు లేక ఈ పరిస్థితి దాపురించిందని, మరో 200మంది ఆస్పత్రుల్లో ఉన్నా ఎందుకిలా జరుగుతుందన్న కనీస స్ఫురణ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు.

అలాగే, రాజవొమ్మంగిలో నెలా.. రెండు నెలల పిల్లలు 15మంది పౌష్టికాహారలోపంతో చనిపోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఐఏఎస్‌లను పెట్టేవారని, కానీ ఇప్పుడు మాత్రం అర్హత లేని వ్యక్తులను నియమిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని భూములు కోల్పోయిన రైతులకు ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ధరలు చెల్లిస్తున్నారని, పట్టిసీమలో ఇస్తున్నట్లుగానే ప్రతి ఎకరాకు రూ.19లక్షలు రైతులకు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అందరికంటే ముందే భూములిచ్చిన తమను ఎందుకిలా చేస్తున్నారని రైతులు కంటతడి పెడుతున్నారని, ఆ కన్నీళ్లలో బాబు కొట్టుకోపోవడం ఖాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల బాధలు చంద్రబాబు ఎందుకు పట్టడం లేదో అర్ధంకావడం లేదన్నారు.

కొండపోడు భూములపై గిరిజన రైతులకు వైఎస్‌ హయాంలో హక్కులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని, కానీ వాటిని కూడా చంద్రబాబు లాక్కున్నారని, ఆ భూములకు రైతులకు ఇచ్చినట్లుగా కాకుండా వేర్వేరుగా నష్టపరిహారం చెల్లిస్తున్నారని, సామాన్యంగా రైతులకు ఎంత ఇస్తున్నారో అంతే రేటు గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములకు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు తిరిగి భూములు ఇవ్వాలన్నారు. కొందరికి భూములు ఇచ్చారని, వారికిచ్చిన భూములకు ఏ రేటు ఉంటే అదే రేటును భూములు దక్కని వారికి నష్టపరిహారంకింద చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. 100 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్న గిరిజనులకు కనీసం ఇళ్లు కట్టించకపోవడం దారుణం అని, ఆ పని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.



చంద్రబాబు దగ్గర న్యాయం జరగదని, ఆయనకు పోలవరం కాంట్రాక్టుల మీద ఉన్న ధ్యాస ఈ ప్రాజెక్టు కింద మునిగిపోతున్న గిరిజనులపై లేదని మండిపడ్డారు. తరంగానీ కాంట్రాక్టర్లకే చంద్రబాబు ప్రాజెక్టు పనులు అప్పగిస్తారని, గతంలో 16వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం అయితే, ఇప్పుడది 40 వేల కోట్లకు పెంచారని, సబ్‌ కాంట్రాక్టర్లతో లంఛాలు పంచుకునేందుకే ఆయన వ్యయాన్ని అమాంతం పెంచారని చెప్పారు. సబ్‌ కాంట్రాక్టర్లలో ఒక సబ్‌ కాంట్రాక్టర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌ అని, ఆయనకు ఏ రకంగా కాంట్రాక్ట్‌ ఇచ్చారని నిలదీశారు.

చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదని, ఇప్పటికే మూడేళ్ల పాలన ముగిసిందని, దేవుడు అనుకూలిస్తే వచ్చే ఏడాది ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. దేవుడు కూడా చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తాడని, పేదల కెరటం సునామీల తాకి చంద్రబాబును బంగాళాఖాతంలో పడేస్తుందని చెప్పారు. ‘ఈ ప్రభుత్వం తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. అప్పుడు మంచి రోజులు వస్తాయి. మీ అందరి కష్టాలు తీరుస్తాను. ఏ సమస్య వచ్చినా నేను ముందుండి పోరాడుతాను’  అని వైఎస్‌జగన్‌ సభకు హాజరైన ప్రజానీకానికి హామీ ఇచ్చారు.     

Advertisement
Advertisement