'బాబును అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయిస్తాం' | Sakshi
Sakshi News home page

'బాబును అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయిస్తాం'

Published Wed, Aug 31 2016 7:49 PM

'బాబును అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయిస్తాం' - Sakshi

తాడేపల్లి : ఉండవల్లి కరకట్టపై నివసిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించి తీరుతామని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. బుధవారం ఆయనిక్కడ మాట్లాడుతూ...ఇరిగేషన్ శాఖకు చెందిన నదీతీర స్థలాల్లో చిన్నమొక్క నాటాలన్నా ప్రభుత్వ అనుమతులు పొందాలన్నారు. అలాంటిది తన పేరు మీద ఉన్నది గాని, ప్రభుత్వ ఆస్తిగాని కాని అక్రమ నివాసంలో నివసిస్తున్న ముఖ్యమంత్రి ఆ నివాసం కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. 
 
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నివాసాలలో నివసిస్తూ కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాలన్నింటినీ సక్రమ నివాసాలుగా మారుస్తారా ? అని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నివసిస్తున్న అక్రమనివాసంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, మరికొద్ది రోజులలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి ఉండవల్లి గ్రామంలోని భూములను తీసుకున్న చంద్రబాబు కరకట్ట వెంబడి తన అక్రమ నివాసమున్న భూములను మాత్రం ఎందుకు తీసుకోలేదన్నారు.
 
ఓటుకు కోట్లు కేసులో తాను అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించానని.. చంద్రబాబు తప్పించుకోలేడన్నారు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన స్వార్థానికి ఎంతటి వ్యవస్థనైనా మేనేజ్ చేయగలరని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు తెలుగు తమ్ముళ్లు తనను విమర్శించినంత మాత్రాన తాటాకు చప్పుళ్ళకు భయపడే రకం కాదని, చంద్రబాబు అధికారంతో చేస్తున్న దురాగాతాలన్నింటినీ ప్రజలకు తెలియజేసి తీరుతామన్నారు. తాడేపల్లి పరిసరాల్లో ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుచరులు కరకట్టపై అక్రమంగా నిర్మించిన భవనాలు అధికారులకు కనపడడం లేదా? అని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement