రయ్... రయ్ | Sakshi
Sakshi News home page

రయ్... రయ్

Published Mon, Jun 9 2014 4:11 AM

రయ్... రయ్

  •      ఖమ్మం-కురవి, రాయపట్నం-వరంగల్
  •      ఆర్‌అండ్‌బీ నుంచి ఎన్‌హెచ్‌కు మళ్లింపు
  •      జాతీయ రహదారుల విభాగం గ్రీన్‌సిగ్నల్
  •  హన్మకొండ, న్యూస్‌లైన్ : జిల్లాలో మరో రెండు రహదారులు నేషనల్ హైవే (జాతీయ రహదారులు) విభాగంలో చేరిపోయాయి. ఎన్నికలకు ముందే ఈ రెండు రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించగా... తెలంగాణ రాష్ట్రంలో వీటికి మోక్షం లభించింది. ఇప్పటికే ఒక రహదారికి సంబంధించి విస్తరణ పనులు మొదలయ్యూయి.

    జిల్లాలో ఇటీవలే తానంచెర్ల-మల్లంపల్లి (ఎన్‌హెచ్ 365), ఆత్మకూరు-సిరొంచ (ఎన్‌హెచ్ 363) రోడ్లు నేషనల్ హైవేలో చేరాయి. ఈ రోడ్ల విస్తరణకు నిధులు కూడా విడుదలయ్యాయి. ఈ క్రమంలో మరో రెండు రోడ్లను నేషనల్ హైవే పరిధిలోకి తీసుకొచ్చారు.
     
    ఖమ్మం-కురవి
     
    ఖమ్మం నుంచి కురవి వరకు ఉన్న స్టేట్ హైవేను ఎన్‌హెచ్ పరిధిలోకి మార్చేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు జాతీయ రహదారుల విభాగానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ రోడ్డులో కరీంనగర్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడకు వెళ్లే పెద్ద పెద్ద వాహనాల సంఖ్య పెరిగిందని నివేదికల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ రహదారిగా మార్చాలని, విస్తరణ అనంతరం జిల్లా సరిహద్దులో టోల్‌గేట్ ఏర్పాటు చేయూలని  చేసిన ప్రతిపాదనలను నేషనల్ హైవే విభాగం స్వీకరించింది.

    ఖమ్మం-కురవి రోడ్డును నేషనల్ హైవే పరిధికి మార్చుతున్నట్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఈ రోడ్డుకు ఎన్‌హెచ్ సంఖ్యను కేటాయించనున్నట్లు ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ విభాగాలకు సమాచారం అందజేసింది. ప్రస్తుతం డబుల్ లేన్‌గా ఉన్న ఈ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని... ఆ తర్వాత ఫోర్ లేన్‌గా విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది.
     
    రాయపట్నం-వరంగల్
     
    ఇప్పటివరకు రాయపట్నం-కోదాడ వరకు ఉన్న స్టేట్ హైవేను రాయపట్నం- వరంగల్‌గా మార్చి నేషనల్ హైవే పరిధికి మార్చారు. 135 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు సైతం నేషనల్ హైవే విభాగం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ కింద భీమారం-అనంతసాగర్ వరకు విస్తరణకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. ఆర్‌అండ్‌బీ విభాగం నుంచి విస్తరణ పనుల టెండర్లు పిలిచారు. ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును రూ. 21 కోట్లతో ఫోర్ లేన్‌గా తీర్చిదిద్దనున్నారు.

    ఈ క్రమంలోనే రాయపట్నం నుంచి వరంగల్ వరకు 135 కిలోమీటర్లను ఎన్‌హెచ్ పరిధికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌హెచ్ పరిధికి మారుస్తున్నట్లుగా ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోడ్డుకు కూడా ఇంకా సంఖ్యను కేటాయించలేదు. సంఖ్యను కేటాయించిన అనంతరం డబుల్ లేన్‌గా ఉన్న ఈ రోడ్డు ఫోర్‌లేన్‌గా విస్తరణకు నోచుకోనుంది.
     

Advertisement
Advertisement