10 వేల కోట్లతో గురుకులాల అభివృద్ధి | Sakshi
Sakshi News home page

10 వేల కోట్లతో గురుకులాల అభివృద్ధి

Published Thu, Oct 20 2016 3:25 AM

10 వేల కోట్లతో గురుకులాల అభివృద్ధి - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘‘ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు మూడేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ నిధులతో అన్ని సొసైటీల పరిధిలోని గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు, పూర్తిస్థాయి వసతులు కల్పిస్తాం. అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేలా ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతాం’’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే  ‘స్కూల్ లీడర్స్ కన్వెన్షన్-2016’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో విస్తృతంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే 240 ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించగా.. వచ్చే ఏడాది మరో 210 పాఠశాలలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం అన్ని సొసైటీ పాఠశాలల్లో 4.5 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఒక్కో పాఠశాలను పూర్తి సౌకర్యాలతో నెలకొల్పేందుకు రూ.20 కోట్లు ఖర్చవుతుందని, ఏడాదిపాటు నిర్వహణకు రూ.3 కోట్లు వెచ్చించాలన్నారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో 700 గురుకుల పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు అవసరమన్నారు. వీటిల్లో పూర్తిస్థాయి ఉద్యోగులను భర్తీ చేస్తామని, ఈ మేరకు 14 వేల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కడియం ప్రకటించారు.

 డిజిటల్ బోధనకు సిద్ధం: గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన చేపట్టనున్నట్లు కడియం వివరించారు. ఈ మేరకు డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సొసైటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు సొసైటీ లీగ్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. చాలా గురుకులాల్లో ప్రిన్స్‌పాల్స్ స్థానికంగా ఉండడం లేదని కడియం అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లోని పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాలని.. పనిచేసే గురుకులంలో ప్రిన్స్‌పల్ కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్లో నివాసం ఉండాలని స్పష్టం చేశారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థి ఉత్తీర్ణత కాకుంటే అందుకు సదరు ప్రిన్స్‌పాల్ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, లక్ష్మణ్, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement