పరిగి.. పవర్ హబ్‌గా పెరిగి.. | Sakshi
Sakshi News home page

పరిగి.. పవర్ హబ్‌గా పెరిగి..

Published Sat, Apr 16 2016 4:05 AM

పరిగి.. పవర్ హబ్‌గా పెరిగి.. - Sakshi

♦ ఇప్పటికే ఐదు మెగావాట్లతో సోలార్‌ప్లాంట్
♦100 మెగావాట్ల విండ్ పవర్ రెడీ
♦  ఏర్పాటవుతున్న మరో రెండు ప్లాంట్లు
 
 పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి పవర్ హబ్‌గా మారుతోంది. ఇప్పటికే మండల పరిధిలోని కాళ్లాపూర్ శివారులో ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సౌర వెలుగులు ప్రారంభమయ్యాయి. కొత్తగా మరో రెండు సోలార్‌ప్లాంట్ల నిర్మాణం అవుతోంది. వీటిల్లో నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులో ఏడాది క్రితం ప్రారంభమైన సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఆ సంస్థ యూనిట్‌కు రూ.5.60 చొప్పున ప్రభుత్వానికి విక్రయిస్తోంది. ఆ ప్లాంటు కంటే రెండింతల సామర్థ్యం ఉన్న మరో రెండు సోలార్ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ 11.2 మెగావాట్లతో నస్కల్ శివారులో ఒకటి, 10 మెగావాట్ల సామర్థ్యంతో బర్కత్‌పల్లి శివారులో మరోటి ఏర్పాటు చేస్తోంది. నస్కల్ శివారులోని ప్లాంటు పనులు పూర్తి కావడంతోపాటు ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. ఈ వారంలో ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.  

 వరుసగా వస్తున్న ప్రాజెక్టులు: జిల్లాలో ఎక్కడాలేని విధంగా పరిగికి ఒకటి తరువాత ఒకటి ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. మండలంలో రూ. 600 కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యంతో మొదటిసారిగా నూతన టెక్నాలజీతో విండ్ పవర్ (పవన విద్యుత్) ప్రాజెక్టు విద్యుదుత్పత్తికి సిద్ధమైంది. ఇప్పటికే రూ.40 కోట్లతో ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి సంవత్సర కాలంగా కొనసాగుతోంది. నస్కల్ శివారులో రూ.100 కోట్లతో 11.2 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. రూ.100 కోట్లతో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో మరో సోలార్ ప్లాంటు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో మొత్తంగా దాదాపు 145 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇప్పటికే పరిగిలో 220 నిర్మాణం పూర్తికాగా 400 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు గతంలో భూమిపూజ చేశారు.
 
 సరికొత్త టెక్నాలజీతో..
 ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న నస్కల్ శివారులోని సోలార్ పవర్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు వాడని కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. గతంలో ఫ్లాట్ సిస్టం సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయగా ఇందులో ఆటోమేటిక్ రేడియేషన్ ట్రాకింగ్ సిస్టంతో పనిచేసే సోలా ర్ పలకలు ఏర్పాటు చేశారు. ఈ పలకలు సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు ఆటోమేటిక్‌గా (పొద్దుతిరుగుడు పువ్వులా) తిరుగుతాయి. దీంతో రోజంతా నాణ్యమైన ఎక్కువ మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలవుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో ఒక్కో మెగావాట్‌కు అదనంగా రెండువేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు.

Advertisement
Advertisement